తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. చంద్రబాబు వెళ్లిన చోటల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే కాట్రావులపల్లిలో పంట పొలాలను పరిశీలించిన చంద్రబబు…ఎడ్లబండిని స్వయంగా నడిపిన ఘటన వైరల్ గా మారింది. కొరడా పట్టుకొని ఎడ్లను చంద్రన్న తోలిన ఫొటోలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా జగన్ పై విరుచుకుపడ్డారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని జగన్ సంక్షోభంలోకి నెట్టివేశాడని నిప్పులు చెరిగారు.
ప్రజలపై జగన్ రూ.10 లక్షల కోట్ల రుణభారం మోపారని, ఇంటికి రూ.10 లక్షల అప్పు ఉందని అన్నారు. ఆ అప్పు జనమే కట్టాలని… జగన్ మోహన్ రెడ్డి కట్టడని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని, ఓడిపోతే ఎక్కడికి పారిపోతాడో…ఏ జైలుకు పోతాడో తెలీదు అంటూ సెటైర్లు వేశారు. మన ఆస్తులను, మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితిని జగన్ తెచ్చాడని దుయ్యబట్టారు.
ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిని నియమించనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. సాధికార సారథుల నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేలా ఈ విభాగం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్ లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని తెలిపారు.
టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామని, అందుకే మరోసారి అలా జరగకుండా పటిష్ఠ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.