ఏపీలో మూడు రాజధానులకు మాత్రమే తాము కట్టుబడి ఉన్నామని.. గత మూడేళ్లుగా ఏపీ అధికార పార్టీ వైసీపీ నాయకులు పదే పదే చెప్పారు. అంతేకాదు.. మూడు ప్రాంతాలకు మంచి జరుగుతుంటే.. అడ్డు పడేవారు.. అసలు ఏపీ నేతలే కాదంటూ.. ఎదురు దాడి కూడా చేశారు. పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకునే వారు.. (చంద్రబాబు.. పవన్) ఏపీకి రాజధానిని నిర్ణయిస్తారా? అని కూడా ప్రశ్నించారు. మూడు రాజధాను లతోనే ప్రజలకు మేలు జరుగుతుందని.. రాష్ట్రం పరుగులు పెడుతుందని కూడా చెప్పుకొచ్చారు.
ఇక, ఈ క్రమంలో రైతులు చేసిన యాత్రలను.. బలంగా అడ్డు కున్నారు. పోలీసులను మోహరించారు. సరే.. మూడు రాజధానులకు అయినా.. కట్టుబడ్డారా? అంటే.. సుప్రీంకోర్టులో ఒక మాట.. హైకోర్టులో మరో మాట. ఇటు పెట్టుబడి దారుల కోసం ఇంకో మాట. వెరసిమొత్తంగా.. ఏపీ ప్రజలకు అధికార పార్టీ మాటల టోపీ పెడుతూ.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
మొత్తంగా ఏపీ రాజధాని పరిణామాలను విశ్లేషిస్తే.. అమరావతి కోసం 12 వందల కోట్లు ఇచ్చామని.. ఇక, అమరావతికి తామే భూమి పూజ కూడా చేశామని.. కేంద్రం ఇటీవల చెప్పింది. అంతేకాదు.. అసలు మూడు రాజధానుల విషయం తమకు చెప్పను కూడా చెప్పలేదని తెలిపింది. హైకోర్టు విషయానికి వస్తే.. అబ్బే మూడు రాజధానులపై చేసిన చట్టాన్ని తాము ఉపసంహరించుకున్నామని.. కాబట్టి.. మూడు అనే మాటే లేదని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు.
సుప్రీంలోనూ ఏపీ రాజధానిగా అమరావతే ఉందని.. పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ర రెడ్డి మాత్రం.. అసలు మూడు రాజధానులే లేవని.. ఉన్నది ఒక్కటే జిందగీ అన్నట్టుగా.. ఉన్నది ఒక్కటే విశాఖ అని వెల్లడించారు. మరి ఇప్పటి వరకు చేసిన విన్యాసాల మాటేంటి? అనేది ఇప్పుడు తెరమీదికి వచ్చిన ప్రశ్న. ఒకవైపు రైతులను ఏళ్ల తరబడి ఏడిపిస్తున్నారు. మరోవైపు.. విశాఖలో ఉద్యమాలు చేయించారు. ఇటు కర్నూలులో సీమకోసం.. నిరసనలు నడిపించారు. మరి ఇప్పుడు అవన్నీ.. ఏమైనట్టు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.