వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజాపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు ఛెరిగిన సంగతి తెలిసిందే. తనకు చీర, గాజులు పంపుతానని మహిళా మంత్రి అన్నారని, చీరలు కట్టుకొని గాజులు వేసుకునే మహిళలు చేతకాని వారా అని రోజానుద్దేశించి కొద్ది రోజుల క్రితం లోకేష్ ప్రశ్నించారు. ఓ మహిళా మంత్రి అయి ఉండి మహిళలను కించపరిచేలా మాట్లాడడం ఏమిటని మండిపడ్డారు. ఆ చీర, గాజులు పంపితే వాటిని తన అక్కచెల్లెళ్లకు ఇచ్చి వాళ్ళ కాళ్లకు మొక్కి గౌరవిస్తానని లోకేష్ అన్నారు. రోజా నాయకుడిలా తల్లిని, చెల్లిన మెడబెట్టి బయటకు గెంటను అంటూ జగన్ పై లోకేష్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే రోజా ఇంటికి చీర, గాజులతో వెళ్లిన తెలుగుమహిళా నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై లోకేష్ స్పందించారు. రోజాకు తెలుగు మహిళలు సారె పెట్టేందుకు వెళితే వారిని అరెస్టు చేయించిందని ఫైర్ అయ్యారు. సాటి మహిళను అత్యంత దారుణంగా కొట్టించి, అరెస్ట్ చేయించిన రోజా మహిళల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జబర్దస్త్ ఆంటీ అవినీతిని ప్రశ్నిస్తే మహిళను కించపరిచినట్టట… నా పళ్లు రాలగొడతానని జబర్దస్త్ ఆంటీ వార్నింగ్లు ఇస్తోంది అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. పళ్లు రాలగొట్టాల్సి వస్తే ముందుగా చంద్రబాబుకు వార్నింగ్ లు ఇచ్చిన జగన్ రెడ్డి పళ్లు రాలగొట్టాలి ఆంటీ అంటూ రోజాకి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు 16 హౌస్ కమిటీలు, 8 సీఐడీ కేసులు పెట్టినా ఒక్కటీ నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు.
లక్ష్మీపార్వతి తమపై సుప్రీంకోర్టులో వేసిన కేసుల్లో కనీసం ఆధారాలు కూడా చూపలేకపోయారని గుర్తు చేశారు. జబర్దస్త్ ఆంటీ… ఇదీ మా చిత్త శుద్ధి ! అని ఛాలెంజ్ చేశారు. తమ ఆస్తులు ప్రతీ ఏటా ప్రకటిస్తున్నామని, వైసీపీలో మీరు, మీ 150 మంది దొంగలు కూడా ఆస్తులు ప్రకటించగలరా?” అని లోకేశ్ సవాల్ విసిరారు.