ఈటల రాజేందర్. ప్రస్తుతం బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్నారు. హుజూరాబాద్ నుంచి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ పక్షాన గెలిచి నిలిచారు. అయితే.. ఆయన రాజకీయాలు.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్నాయి. హుజూరాబాద్ నుంచి టీఆర్ ఎస్ తరఫున వరుస విజయాలు దక్కించుకుని తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోకేసీఆర్ మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్నారు. రెండో దఫా ప్రభుత్వంలోనూ కేసీఆర్.. ఈటలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. ఏం జరిగిందో ఏమో.. ఏడాదిన్నర కిందట ఆయనను పార్టీ నుంచి అవమానకర రీతిలో బయటకు పంపేశారు.
మంత్రిగా ఉన్న ఈటలను బర్తరఫ్ చేయాలంటూ.. గవర్నర్‌కు సీఎం సిఫారసు చేయడం.. అప్పట్లో కలకలం రేపింది. ఇక, ఈటల హ్యాచరీ భూముల వివాదం.. తీవ్రస్థాయిలో రాజకీయ మంటలు రాజేసింది. దీనిపై కోర్టుజోక్యం చేసుకుంది. ఇదిలావుంటే.. ఈటల ఈ సమయంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుని.. మంత్రి పదవికి.. అప్పటి టీఆర్ ఎస్‌కు కూడా రాజీనామా చేశారు. హుజూరాబాద్ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికలో విజయం దక్కించుకున్నారు. తరచుగా.. అధికార పార్టీపైనా.. మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్లపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ.. ఇప్పటి వరకు జరిగిన సంగతి..
కట్ చేస్తే.. తాజాగా సీఎం కేసీఆర్.. అసెంబ్లీ వేదికగా.. ఈటల పేరును పదే పదే ప్రస్తావించారు. మొత్తం కేసీఆర్ 2 గంటలకుపైగా ప్రసంగించారు. ఈ క్రమంలో ఈటల పేరును ఏకంగా 10 నుంచి 15 సార్లు ప్రస్తావించడం గమనార్హం. ఈ సమయంలో ఆయనను విమర్శించలేదు.. సరికదా.. `మిత్రుడు ఈటల.. మిత్రుడు ఈటల రాజేందర్“ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదేసమయంలో అసెంబ్లీలో ఈటల సంధించిన అన్ని ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అయితే.. ఈ అనూహ్య పరిణామం.. రాజకీ యంగా చర్చకు వచ్చింది.
కేసీఆర్ మాట్లాడిన మాటల వెనుక ఏదో బలమైన కారణం ఉండకపోలేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావించడం వెనుక కారణమేంటి?, 2 గంటల కేసీఆర్ ప్రసంగంలో 10 సార్లకు పైగా ఈటల పేరు ప్రస్తావించడం వెనుక కారణమేంటి? అని అసెంబ్లీలోనే సభ్యులు చెవులు కొరుక్కోవడం కనిపించింది. ఈటల పేరు ప్రస్తావించే సమయంలో `ఘర్ వాపసీ` అంటూ అసెంబ్లీలో సభ్యులు నినాదాలు చేయడం గమనార్హం.
మరి ఈటల రెస్పాన్స్ ఇదీ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే తన పేరు ప్రస్తావించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని ఈటల అన్నారు. అబద్దాన్ని అటూ చెప్పగలరు.. ఇటూ చెప్పగలరని ఈటల మండిపడ్డారు. బీఆర్ఎస్లో తిరిగి చేరేది లేదని స్పష్టం చేశారు. తనది పార్టీ మారే చరిత్ర కాదని, గెంటేసినవాళ్లు పిలిచినా పోను అని ఈటల స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో సైనికుడిగా పనిచేశా.. ఇప్పుడు బీజేపీలో కూడా అలానే పనిచేస్తానని ఎమ్మెల్యే ఈటల వెల్లడించారు.