అదేంటి? అనుకుంటున్నారా?.. ఔను.. మీరు చదివింది నిజమే. సాక్షాత్తూ.. గుడిలో ఉన్న ఆంజనేయ స్వామికే అధికారులు నోటీసులు జారీ చేశారు. గర్భాలయానికి ఉన్న గోడపై వారునోటీసు కూడా అంటించారు. స్వామీ.. మీరు మా స్థలం ఆక్రమించుకున్నారు. ఓ వారం రోజులు గడువు ఇస్తున్నాం.. త్వరగా ఖాళీ చేసి వెళ్లిపోండి స్వామీ.. అని ఉన్నతాధికారులు సంతకం చేసి మరీ.. స్టాంపు వేసి మరీ.. డేట్, గడువుతో సహా.. నోటీసులు జారీ చేశారు. మరి చిత్రమైన ఈ ఘటన గురించి తెలుసుకోవాలంటే.. ఇదిచదవాల్సిందే!
మధ్యప్రదేశ్ లో ఏకంగా హనుమంతుడి పేరు మీద విడుదలైన ఈ నోటీసులో.. రైల్వే శాఖకు చెందిన భూమిని ఆక్రమించారని అధికారులు పేర్కొన్నారు. వారం రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఖాళీ చేయకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జేసీబీ సహా కూల్చివేతకు అయ్యే ఖర్చులు కూడా వసూళు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఝాన్సీ రైల్వే డివిజన్ అధికారులు జారీ చేసిన వింత నోటీసు పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నోటీసు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
మురైనా జిల్లాలోని సబల్‌గఢ్‌లో అధికారులు కొత్తగా రైల్వేలైన్‌ను నిర్మిస్తున్నారు. గ్వాలియర్-షియోపుర్ మధ్య ఏర్పాటు చేస్తున్న ఈ లైన్లో ఓ హనుమాన్ ఆలయం ఉంది. ఆ గుడి.. రైల్వే శాఖకు చెందిన భూమిలో ఉందని.. అందుకే ఈ నోటీసులు జారీ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వే శాఖకు చెందిన భూమిని హనుమంతుడు ఆక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటివి జరిగినట్టు ఆలయ ట్రస్టు బోర్డులకు నోటీసులు ఇస్తారు.. లేదా సదరు స్థలాన్ని విడిచి పెట్టి నిర్మాణాలు చేపడతారు కానీ, ఘనత వహించిన రైల్వే అధికారులు ఏకంగా దేవుడికే నోటీసులు ఇచ్చారు. మరి ఈ హనుమయ్య ఏం చేస్తారో.. చూడాలి.