ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవ్ రెడ్డిలపేర్లు ముందు నుంచి వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఎమ్మెల్సీ కవితతో, మాగుం శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్, విజయ సాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి పాత్రను వివరించడం సంచలనం రేపింది. బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు, రుణ్పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు ఈడీ వివరించింది.
ఇండోస్పిరిట్స్ సంస్థ అసలు భాగస్వాములు మాగుంట రాఘవ్‌రెడ్డి, కవిత అని ఈడీ వెల్లడించింది. ఇండో స్పిరిట్స్‌కు ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని, రామచంద్ర పిళ్లై వెనుక కవిత ఉన్నారని తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తరఫున ప్రేమ్ రాహుల్ పనిచేస్తున్నారని ఈడీ వెల్లడించింది. మాగుంట,రాఘవ్ రెడ్డి, కవిత, శరత్‌రెడ్డిల నియంత్రణలో సౌత్‌గ్రూప్ ఉందని, రూ.100 కోట్ల ముడుపులను విజయ్నాయర్కు ఆ గ్రూప్ ఇచ్చిందని ఆరోపించింది. ఆప్ నేతలకు, సౌత్ గ్రూప్ నకు మధ్య కుదిరిన డీల్‌గా దానిని వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఇటీవల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా మాగుంట తనయుడు రాఘవ్ ను అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో రాఘవ్ ను ప్రశ్నించిన సీబీఐ…అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. రాఘవ్ ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హజరుపరిచి కస్టడీకి అనుమతి కోరే యోచనలో సీబీఐ అధికారులున్నారు.