రాఖీ సావంత్.. ఈ పేరెత్తగానే వివాదాలే గుర్తుకు వస్తాయి. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్లు, ఐటం సాంగ్స్ చేసిన ఈ భామ.. రాఖీ కా స్వయంవర్ పేరుతో చేసిన టీవీ షో ఒక పెద్ద సంచలనం. ఈ షో ద్వారా తనకు కావాల్సిన వరుడిని ఎంచుకుంటానంటూ ఆమె అప్పట్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చివరికి ఈ షోలో గెలిచిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోలేదు. కొన్నేళ్ల కిందట అదిల్ దురానీ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడింది. కానీ వీరి వైవాహిక జీవితం ఎంతో కాలం సాఫీగా సాగలేదు. తన భర్త మీద ఆమె కేసులు పెట్టడం, మీడియాలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తనతో ఆదిల్ అసభ్యకరంగా శృంగారం చేశాడని, కట్నం గురించి వేధించాడని రాఖీ కేసు పెట్టగా.. అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా రాఖీ.. ఆదిల్ మీద మరింత తీవ్ర ఆరోపణలు చేసింది. ఆదిల్ తన న్యూడ్ వీడియోలు తీసి విక్రయించినట్లు ఆమె ఆరోపించడం గమనార్హం. అవును. ఆదిల్ నా న్యూడ్ వీడియోలను తీసి కొందరికి విక్రయించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆ కేసు ప్రస్తుతం సైబర్ క్రైమ్ విభాగంలో విచారణలో ఉంది. ఆదిల్ నన్ను చాలా రకాలుగా మోసం చేశాడు. అతను చందేల్ అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అతనికి బెయిల్ రాకూడదు. ఆదిల్ నన్ను చిత్రహింసలు పెట్టాడు. దానికి సంబంధించిన రుజువుగా మెడికల్ బిల్స్ ఉన్నాయి. అలాగే అతను నా దగ్గర ఓటీపీ తెలుసుకొని నా డబ్బుని దొంగిలించాడు’ అని రాఖీ చెప్పుకొచ్చింది. తన నుంచి కోటిన్నర రూపాయలు తీసుకున్నట్లు ఆదిల్ ఒప్పుకున్న వీడియోను కూడా రాఖీ బయటపెట్టింది. కాగా రాఖీ ఆరోపణలన్నింటినీ ఆదిల్ ఖండిస్తున్నాడు. తాను మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కాదలుచుకోలేదని అతను వ్యాఖ్యానించాడు.