‘అన్ స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే’ టాక్ షో సెకండ్ సీజన్ చివరి ఎపిసోడ్ లో టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో రెండో భాగం పొలిటికల్ ప్రశ్నలతో సాగింది. ఇటీవల పవన్ ఇప్పటంలో కారుపై ఎక్కిన ఘటన గురించి బాలయ్య అడిగారు. గదిలో నుంచి బయటకు రాకూడదు, కారులో నుంచి దిగకూడదు అంటూ ఇబ్బంది పెట్టారని, వైజాగ్ లో తనను హోటల్ గదిలో నిలిపివేసిన ఘటనకు ఇది కొనసాగింపు అని పవన్ అన్నారు.
అందుకే, ఇప్పటంలో తనను ఆపగానే చాలా కోపం వచ్చిందని, చాలాకాలం తర్వాత తిక్క లేచిందని పవన్ చెప్పారు. అందుకే, నేను కారు ఎక్కి వెళతా…ఎవరు ఆపుతాడో చూస్తాను అంటూ మొండిగా వెళ్లాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు. ఇక, సినిమాల విషయానికొస్తే బాలయ్యతో మల్టీ స్టారర్ చేయాలని ఉందని పవన్ అన్నారు. చిరంజీవి నుంచి ఏం నేర్చుకున్నారు? ఏం వదులుకున్నారు అనే ప్రశ్నకు పవన్ కీలక సమాధానమిచ్చారు.
ఫ్యామిలీ కోసం చిరంజీవిగారు ఒళ్లు దాచుకోకుండా పనిచేసేవారని, ఆయన నుంచి ఆ హార్డ్ వర్క్ నేర్చుకున్నానని పవన్ అన్నారు. అన్నయ్యకు మొహమాటం ఎక్కువని, ఆయన చాలా విషయాల్లో మొహమాటపడుతుంటారని చెప్పారు. మంచితనం ఒక్కోసారి ఇబ్బంది పెడుతుందని, అందుకే, ముఖస్తుతి, మొహమాటాలను తాను దూరం పెడుతుంటానని అన్నారు. అన్నయ్య దగ్గరనుంచి వదిలేసింది అదేనని చెప్పారు.
బాలకృష్ణగారు మంచి మనసున్న మనిషని, మొహమాటం లేదని అన్నారు. ఓ దశలో బాలయ్య సినిమాలు ఆడకపోతే అపుడు తమ ఫ్యామిలీలోని అందరం కూడా ఆయన సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నామని పవన్ అన్నారు. తమ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని పవన్ అన్నారు. ఇక, ప్రజాసేవ చేస్తూనే మరో వైపున సినిమాలు చేయాలని బాలయ్య చెబుతూ పవన్ భుజం తట్టడంతో ఈ షో సెకండ్ సీజన్ కు ఎండ్ కార్డ్ పడింది.