వైసీపీపై ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనని చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అయినా సరే తాను భయపడేది లేదని కోటంరెడ్డి సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోటంరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను వైసీపీ తరఫున పోటీ చేయబోనని కోటంరెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తానని, తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని కోటంరెడ్డి అన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాల ఏ పార్టీలో ఉండబోతున్నారో, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ బీఫామ్ జేబులో పెట్టుకుని జగన్ ను కలిసిన ఘనత ఆదాలదని ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తి తన గురించి మాట్లాడుతున్నారా అంటూ సెటైర్లు వేశారు.
పులివెందుల రౌడీ జగన్, నెల్లూరు రౌడీ కోటంరెడ్డి అని గతంలో ఆదాల చేసిన విమర్శలు ఇంకా నెల్లూరు ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ఇప్పటికైనా ఒకే పార్టీలో ఉండాలని, గతంలో మాదిరి అన్ని పార్టీలు తిరగొద్దని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదాలకు వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చని, కానీ తనకు అంతకన్నా విలువైన ప్రజల ఆశీస్సులున్నాయని అన్నారు. తనకు ఆదాల వంటి వారు శత్రువులు కాదని కేవలం రాజకీయ పోటీదారులు మాత్రమేనని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశానని, అదే తరహాలో వైసిపి ప్రభుత్వం కూడా ఎందుకు విచారణ జరపాలని కోరడం లేదని ప్రశ్నించారు. విచారణ జరిగితే తనతో పాటు ఇంకెన్ని ఫోన్లో టాప్ అయ్యాయో తెలుస్తాయని అన్నారు.