సీఎం జగన్ అప్పులు…దానికోసం ఆయన పడుతున్న తిప్పలపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ మొదలు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో పలుమార్లు విమర్శించారు. అయినా సరే, ఆదాయం పెంచుకునే మార్గాలను వదిలేసిన జగన్..అప్పుల కోసం మాత్రం అన్వేషిస్తూనే ఉన్నారు. జగన్ అప్పులపై కాగ్ కూడా పలుమార్లు మొట్టికాయలు వేసినా సరే ఫలితం లేకపోయింది.
మూడున్నరేళ్లలో జగన్ రూ. 8 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని, కానీ, ప్రజల ఆదాయం పెరగలేదని, అభివృద్ధీ జరగలేదని ప్రతిపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. వసూలు చేస్తున్న పన్నుల సొమ్ము ఎటు పోతోందో లెక్క లేదని, అప్పులకు, ఆదాయానికి సంబంధం లేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4,42,442 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తాజాగా వెల్లడించారు.
2019తో పోలిస్తే దాదాపు రెండింతలు అప్పులు పెరిగాయని రాజ్యసభలో పంకజ్ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ రకంగా సమాధానమిచ్చారు. 2019లో రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు అని, 2020లో రూ.3,07,671 కోట్లు అని, 2021లో రూ.3,53,021 కోట్లు అని, 2022 సవరించిన అంచనాల తర్వాత అది రూ.3,93,718 కోట్లు అని, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లు అని వెల్లడించారు. ప్రతి ఏటా సుమారు రూ.45వేల కోట్లు అప్పులు ఏపీ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ఏపీ అప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయని, ప్రతి వారం క్రమం తప్పకుండా ఆర్బీఐలో బాండ్లను తాకట్టు పెడుతూ జగన్ అప్పులు తెస్తున్నారని అన్నారు. సీఎంను అప్పురత్న అంటూ పవన్ సెటైర్లు వేశారు. అప్పులతో దేశవ్యాప్తంగా ఏపీ పేరు మార్మోగిపోయేలా చేస్తున్న జగన్ కు ప్రత్యేక శుభాభినందలు అంటూ చురకలంటించారు. ఓ వైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ, వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దంటూ జగన్ కు పంచ్ లు వేశారు. రాష్ట్ర సంపద, భవిష్యత్తును గాలికొదిలేసి… మీ సంపదను పెంచుకోండంటూ జగన్ ను దుయ్యబట్టారు.