నందమూరి బాలకృష్ణ పేరు ఈ మధ్య తరచుగా మీడియాకు, సోషల్ మీడియాకు ఎక్కేస్తోంది. ఆయన ఏం మాట్లాడినా వివాదాస్పదం అయిపోతోంది. కొన్ని రోజుల కిందట వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో అక్కినేని వారి గురించి, ఎస్వీఆర్ గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. అక్కినేని గురించి చేసిన వ్యాఖ్యలు అందరికీ అభ్యంతరకరంగానే అనిపించాయి. దాని మీద బాలయ్య కూడా తన వివరణ ఏదో ఇచ్చాడు. ఐతే ఎస్వీఆర్ గురించి బాలయ్య అమర్యాదకరంగా ఏమీ మాట్లాడలేదు. అయినా సరే.. ఈ వ్యాఖ్యలకు కులం రంగు అద్ది ఒక వర్గం వివాదం రాజేయాలని చూసింది.
స్వయంగా ఎస్వీఆర్ కుటుంబీకులు బాలయ్య వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నా కూడా ఈ బ్యాచ్ ఊరుకోలేదు. ఇదంతా బాలయ్యను దెబ్బ తీయడానికి సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా అనుమానాలు వ్యక్తం చేశారు బాలయ్య అభిమానులు, టీడీపీ మద్దతుదారులు. తాజాగా బాలయ్య అన్స్టాపబుల్ షోలో నర్సుల గురించి చేసిన వ్యాఖ్యల మీద వివాదం మొదలైంది. నిజానికి బాలయ్య పర్టికులర్గా ఒక నర్సు అందంగా ఉందని ప్రస్తావించాడు. నర్సులను మొత్తంగా ఏమీ అనలేదు. ఒక నర్సు అందంగా ఉందంటే అందులో అభ్యంతరం ఏముంటుంది? ఒక వర్గాన్నే కించపరిచినట్లు ఎలా భావిస్తారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనికి నర్సుల సంఘం క్షమాపణ డిమాండ్ చేయడం పట్ల బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ మద్దతుదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఏం మాట్లాడినా దాన్ని వివాదంగా మార్చి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి చూస్తున్నారని.. సినీ అభిమానులల మధ్య కూడా ఏదో రకంగా చిచ్చుపెట్టి విడదీసే.. రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.