నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ రెబల్ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. తన ఫోన్ ట్యాప్ చేశారని, తనను అనుమానించిన చోట తాను ఉండలేనని కోటంరెడ్డి పార్టీతో తెగదెంపులు చేసుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోటంరెడ్డి వ్యవహారంపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించారు.
చివరకు సొంత పార్టీ నేతలపై కూడా దాడులు చేయించి, వారిని బెదిరించి, వారి ఫోన్లను కూడా వైసీపీ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా జగన్ చేతిలో అధికారం ఉందని ఎద్దేవా చేశారు. విపక్షాలపై ఆంక్షలు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ లు, బెదిరింపులు తప్ప రాష్ట్రాభివృద్ధి గురించి జగన్ కు పట్టదని చంద్రబాబు విమర్శించారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడంపై జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులతో భేటీ అయిన తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 70 శాతం వక్ఫ్ బోర్డు ఆస్తులు, భూములు అన్యాక్రాంతం అయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ముస్లింలను కూడా వేధిస్తోందని, అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. జగన్ హయాంలో ముస్లింలపై 72 దాడులు, వేధింపుల ఘటనలు జరిగాయని, ఇంకా వెలుగు చూడనివి చాలా ఉన్నాయని ఆరోపించారు. ముస్లింలకు టీడీనీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వైసీపీ అన్ని వర్గాల పై దాడులు చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ రాజీ పడుతున్నారని, సొంత లాభం కోసమే వైసీపీ ఎంపీలు పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, కరువు జిల్లాలకు నిధులతో పాటు ఏ విషయంలో కూడా కేంద్రంపై వైసీపీ ఎంపీలు ఒత్తిడి తేలేకపోతున్నారని మండిపడ్డారు. కర్ణాటక తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుతో రాయలసీమ సాగునీటికి తీవ్ర నష్టం జరుగుతోందని, ఈ విషయంలో జగన్ కు కనీస స్పృహ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేకా హత్య కేసు నుంచి జగన్ తప్పించుకోలేరని, తాజా పరిణామాలన్నీ ఆయన కుటుంబం వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయని మండిపడ్డారు. జగన్ స్కీం పెట్టాడంటే అందులో సొంత స్కాం ఉంటుందని, జే బ్రాండ్ మద్యం, ఇసుక విధానమే అందుకు ఉదాహరణలని చంద్రబాబు ఎద్దేవా చేశారు.