ఒకటి తర్వాత ఒకటి చొప్పున తాను బరిలోకి దిగిన ప్రతిచోటా విజయకేతనాన్ని ఎగురవేస్తున్న ఆర్ఆర్ఆర్ తాజాగా మరో అవార్డును సొంతం చేసుకుంది. తాజా అవార్డు ప్రత్యేకత ఏమంటే.. అస్కార్ బరిలో నిలిచిన చిత్రాల్ని వెనక్కి నెట్టేసి తాను విజేతగా నిలవటం. జక్కన్న అలియాస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ హాలీవుడ్ మూవీలను తలదన్ని మరీ దూసుకెళ్లటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా అవార్డుతో అస్కార్ మీద ఆశల్ని మరింత పెంచేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.
ఇంతకీ ఆర్ఆర్ఆర్ కు వచ్చిన అవార్డు వివరాల్లోకి వెళితే.. ఫ్యాన్ ఫేవరెట్ మూవీ విభాగంలో ‘గోల్డెన్ టొమాటో అవార్డు’ను సొంతం చేసుకుంది. సాధారణంగా ఈ అవార్డును సినీ ప్రియులు వేసే ఓట్లను ఆధారంగా చేసుకొని ఎంపిక చేస్తుంటారు. అమెరికాకు చెందిన రోటెన్ టొమాటోస్ వెబ్ సైట్ ప్రతి ఏడాది ఈ అవార్డుల్ని ప్రకటిస్తుంటుంది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఆర్ఆర్ఆర్ కు అవార్డు దక్కటం.. దీని కోసం పోటీ పడిన చిత్రాల్లో అస్కార్ ఫేవరెట్ గా నిలిచిన టాప్ గన్: వావరిక్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ వన్స్, అవతార్ -2 చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ఆర్ఆర్ఆర్ విజేతగా నిలవటం సంచలనంగా మారింది.
సినీ ప్రియులు వేసే ఓట్ల ఆధారంగా ప్రకటించే ఈ అవార్డు తమకుసొంతం కావటంపై రాజమౌళి టీం హర్షాతిరేకాల్ని వ్యక్తం చేయటంతో పాటు.. తమను ఎంతగానో ప్రేమించి.. ఓట్లు వేసిన వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఖాతాలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును, జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ ను.. దిఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్, అట్లాంటా క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ తదితరాల్లో విజేతగా నిలిచింది. ఇక.. అస్కార్ బరిలో ఈ మూవీ అస్కార్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కు వీస్తున్న సానుకూల గాలి చూస్తుంటే.. అస్కార్ సొంతమయ్యే అవకాశాలు మొండుగా ఉన్నట్లుగా చెప్పక తప్పదు.