కుప్పంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న హఠాత్తుగా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి రామకృష్ణ తాజాగా ఊరటనిచ్చే వార్త చెప్పారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు తారకరత్న కొద్దిగా కోలుకున్నారని ఆయన వెల్లడించారు.
అంతేకాదు తారకరత్నకు లైఫ్ సపోర్ట్ సిస్టం మద్దతును కూడా డాక్టర్లు కొద్దిగా తగ్గించారని, మందులు వాడకం కూడా కాస్త తగ్గిందని వివరించారు. తారకరత్న గుండె, కాలేయం పనితీరు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఆయన చెప్పారు. కానీ, న్యూరో విషయంలో తారకరత్న కోలుకునేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆయన వివరించారు. తారకరత్న తనకు తానుగా శ్వాస తీసుకోగలుగుతున్నారని, ఇది శుభ పరిణామం అని రామకృష్ణ తెలిపారు.
తమతో పాటు నందమూరి అభిమానులకు కూడా ఈ వార్త ఎంతో సంతోషం కలిగిస్తుందని అన్నారు. తారకరత్న త్వరగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని రామకృష్ణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తారకరత్న కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న నందమూరి అభిమానులకు రామకృష్ణ కృతజ్ఞతలు చెప్పారు. నందమూరి అభిమానుల ఆశీస్సులు తమకు ఎప్పుడూ ఉండాలని ఆయన కోరారు
అయితే, తారక రత్నకు అసలు ఎక్మో పెట్టలేదని తెలుస్తోంది. తారకరత్న తాజా సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. సిటీ స్కాన్ ఫలితాలు మెరుగ్గా ఉంటే వెంటిలేటర్ తీసివేసే ఆలోచనలో వైద్యులు ఉన్నట్లు తెలుస్తోంది. తారకరత్న అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని, కొద్దిసేపటి క్రితం నిర్వహించిన పరీక్షల్లో గుండె, లివర్, కిడ్నీ నార్మల్ గా ఉన్నట్లు రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది. సీటీ స్కాన్ రిజల్ట్ వచ్చాక వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.