మలయాళ సినిమా చరిత్రలో అతి పెద్ద స్టార్ ఎవరంటే మోహన్ లాల్ పేరే చెప్పాలి. మమ్ముట్టికి కూడా కేరళలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. కానీ మోహన్ లాల్‌కు మాస్లో కొంచెం రీచ్ ఎక్కువ. అందులోనూ 60 ప్లస్‌లోకి వచ్చాక మమ్ముట్టి హీరోయిజం పక్కన పెట్టి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేసుకువెళ్తున్నాడు.
కానీ మోహన్ లాల్ మాత్రం తరచుగా మాస్ సినిమాలు చేస్తూ తన బాక్సాఫీస్ రేంజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నాడు. కంటెంట్ సినిమాలతోనూ విజయాలు అందుకున్నాడు. ‘దృశ్యం’ లాంటి థ్రిల్లర్‌తో.. అలాగే ‘పులి మురుగన్’, ‘లూసిఫర్’ లాంటి మాస్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఘనత లాలెట్టన్ సొంతం.
ఐతే కొన్నేళ్ల ముందు వరకు వరుస హిట్లతో దూసుకెళ్లిన మోహన్ లాల్‌కు కొంత కాలం నుంచి అస్సలు కలిసి రావడం లేదు. ఆయన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.
ఆరట్టు, మాన్స్టర్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ఇప్పుడు లాల్ ‘ఎలోన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ‘అధిపతి’, ‘విష్ణు’ లాంటి సినిమాలు తీసిన సీనియర్ దర్శకుడు షాజీ కైలాస్ ఈ చిత్ర దర్శకుడు. కొవిడ్ టైంలో ఒక చోట ఇరుక్కుపోయిన ఒక వ్యక్తి కథ ఇది. ఇందులో లాల్ ఒక్కడే కనిపిస్తాడు. వేరే పాత్రలు కనిపించవు.
ఇలాంటి కథతో ఒక పెద్ద స్టార్ సినిమా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. లాల్ ఏదో ప్రయోగం చేసి చూద్దామనుకున్నాడు కానీ.. అది పూర్తిగా బెడిసికొట్టింది. సినిమాకు ముందు నుంచే బజ్ లేదు. దీంతో రిలీజ్ రోజే థియేటర్లు వెలవెలబోయాయి. చాలా బోరింగ్ అని టాక్ రావడంతో రెండో రోజుకే సినిమా వాషౌట్ అయిపోయింది.
మన దగ్గర నాగ్ నటించిన ‘ఆఫీసర్’ సినిమా పరిస్థితే దాదాపుగా లాల్ ‘ఎలోన్’కు ఎదురైంది. రెండో రోజు జనాలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. లాల్ కెరీర్లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్ అని, బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి పరాభవాన్ని ఆయన ఎప్పుడూ చూసి ఉండరని అక్కడి ట్రేడ్ పండిట్లు అంటున్నారు.