టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా సినీ నటుడు నందమూరి తారకరత్న హఠాత్తుగా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు కూడా తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే లోకేష్ పై రోజా చేసిన కామెంట్లు దుమారం రేపాయి.
ఇటువంటి సందర్భంలో రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ తారకరత్నపై సాటి మనుషులుగా సానుభూతి చూపించాల్సిన వైసీపీ నేతలు మానవత్వం మంట గలిసిందనే రీతిలో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. లోకేష్ ది ఐరన్ లెగ్ అని, పాదయాత్ర ప్రారంభించగానే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని మంత్రి రోజా విషం చిమ్మారు. అంతేకాదు, లోకేష్ ఐరన్ లెగ్ సైకో అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లోకేష్ రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారని విమర్శించారు. గతంలో లోకేష్ పాదయాత్ర పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఎనిమిది మంది చనిపోయారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో రోజా వ్యాఖ్యలపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. రోజాకు డ్యాన్సులు, బూతులు తప్ప ఏం తెలుసని మంతెన ప్రశ్నించారు. విషమంగా ఉన్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు.
సొంత బాబాయిని చంపినవారికి ఇలాంటి క్షుద్ర రాజకీయాలు కొత్త కాదని మంతెన విమర్శించారు. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు లోకేష్ పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అంతకుముందు, లోకేష్ ది ఐరన్ లెగ్ అంటూ మంత్రి అంబటి రాంబాబు తదితర వైసీపీ నేతలు కూడా వివాదాస్పద వ్యక్తులు చేశారు.