టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో హిందూపురం ఎమ్మెల్యే, లోకేష్ మామ బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.
అల్లుడు లోకేష్ అడుగులో బాలయ్య బాబు అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు. మరోవైపు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లోకేష్ బాసటగా నిలిచారు. ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు జీవో నెం.1ని జగన్ తీసుకువచ్చాడని మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడుతున్న పవన్ కల్యాణ్ కూడా బయటికి అడుగుపెట్టకూడదని జగన్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ పర్యటనల కోసం తయారుచేయించుకున్న వారాహి వాహనాన్ని ఏపీలో అడుగుపెట్టనివ్వబోమని వైసీపీ నేతలుంటున్నారని, ఆ వాహనానికి అనుమతులివ్వబోమని అంటున్నారని మండిపడ్డారు. ఏ1 సైకోరెడ్డికి ఒకటే చెబుతున్నా…. నీ జీవో నెం.1ని మడతపెట్టి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అంటూ లోకేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. వారాహి ఆగదు… ఈ యువగళం ఆగదు అని ఛాలెంజ్ చేశారు. యువత తరఫున పోరాడేందుకే యువగళం అని…తమను ఎవరూ ఆపలేరని, అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతామని అన్నారు.
భయం అనేది తన బయోడేటాలో లేదని బాలా మామ మాదిరిగా లోకేష్ డైలాగులు చెప్పారు. తనలో మానవత్వం…మంచితనం ఉన్నాయని, మంచి కోసం పోరాడే దమ్ముందని చెప్పారు. అందుకే తనను ఆశీర్వదించాలని, దీవించాలని చెప్పారు. 400 రోజుల పాదయాత్రలో ఇది తొలిరోజని,తనతో కలిసి నడవాలని, జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దామని పిలుపునిచ్చారు. ఈ యువగళం మన బలం… ప్రజాబలం అని, 2024లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని లోకేశ్ పిలుపునిచ్చారు.