టీడీపీ నేత నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన ఒకరిద్దరు కొంత అస్వస్థతకు గురయ్యారు. ఇతర ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎలా ఉన్నప్పటికీ..కుప్పంలో మాత్రం ఈ రోజు ఎండ కొంచెం ఎక్కువగానే కనిపించింది. ఈ క్రమంలో ఇద్దరు వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు. అదేసమయంలో సినీనటుడు, నందమూరి వారసుడు తారక రత్న సొమ్మసిల్లి పడిపోయారు.
కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేష్ ప్రార్థనలు నిర్వహించారు. లోకేష్‌తో పాటు తారకరత్న కూడా అందులో పాల్గొన్నారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.
వెంటనే స్థానిక నేతలు ఆయన్ను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇదిలావుంటే, లోకేశ్‌కు ఆల్ ది బెస్ట్ చెపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. యువగళం పాదయాత్రకు, పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ప్రజానీకానికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా లోకేష్ పాదయాత్రకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. యువత భవిత కోసం..ప్రజల బతుకు కోసం.. రాష్ట్ర భవిష్యత్ కోసం..లోకేశ్ పాదయాత్ర అంటూ చంద్రబాబు ట్వీట్ చేయడం విశేషం.