74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండా ఎగరేసిన చంద్రబాబు…జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అవకాశాలు కల్పిస్తే తెలుగు ప్రజలు అద్భుతాలు సాధిస్తారన్న ఆలోచనతో 2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ వన్ గా నిలిపేందుకు రూట్ మ్యాప్ రెడీ చేశానని చంద్రబాబు అన్నారు. కానీ, ఆ తర్వాత వచ్చిన జగన్ తన విధ్వంసకర పాలనతో ఆ విజన్ ను నాశనం చేశారని మండిపడ్డారు.
రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మంచిదేనని, కానీ దాన్ని అమలు చేసే వాళ్ళు మంచివారు కాకపోతే ఫలితం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ప్రజాస్వామ్యం మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు.
ప్రపంచంలో అత్యున్న స్థాయికి భారత్ చేరుకునేలాగా విజన్-2047 సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అమెరికాలో పౌరుల తలసరి ఆదాయం 65 వేల డాలర్లు అయితే, భారతీయుల తలసరి ఆదాయం 1,19,000 డాలర్లని గర్వంగా చెప్పారు. ఉమ్మడి ఏపీలో నాటి టిడిపి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఐటి రంగంలో దూసుకుపోతుందని అన్నారు. గ్లోబల్ గవర్నెన్స్ లో భారతీయులు మరింత రాణించే అవకాశాలున్నాయని చెప్పారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా తన హయాంలో వచ్చిన ఐటీ విప్లవాన్ని అవకాశంగా మార్చుకున్నారని, అందువల్లే ఎంతో మంది తెలుగువారు ఈరోజు విదేశాలలో ఐటీ రంగంలో రాణిస్తున్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 100వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే 2047 నాటికి ప్రపంచంలోనే అగ్ర దేశాలలో మొదటి లేదా రెండో స్థానానికి భారత్ చేరుకుంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.