నందమూరి నట, రాజకీయ వారసుడు నందమూరి తారక రత్న కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తారకరత్న పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయం కూడా తెలిసిందే. అయితే, తారకరత్న ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే గుడివాడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని తారకరత్న గతంలో ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తారకరత్న హిందూపురం నియోజకవర్గంలో పర్యటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట రాముడితో తారకరత్న సమావేశం కావడం సత్యసాయి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హిందూపురంలోని రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు, స్థానిక నేతల గురించి వెంకటరాముడితో తారకరత్న చర్చించినట్లు తెలుస్తోంది. దాంతోపాటు, సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలలో రాజకీయ పరిస్థితులు, టీడీపీ నేతల గురించి తారకరత్న అడిగి తెలుసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
వెంకటరావుతోపాటు బాలకృష్ణ అభిమాన సంఘాల నాయకులతో కూడా తారకరత్న ముచ్చటించిన వైనం చర్చనీయాంశమైంది. దీంతో, రాబోయే ఎన్నికల్లో బాబాయ్ బాలకృష్ణ స్థానం నుంచి అబ్బాయి తారకరత్న పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అన్నగారు నందమూరి ఎన్టీ రామారావు టిడిపి పెట్టినప్పటి నుంచి హిందూపురం పార్టీకి పెట్టని కోటలా ఉంది. 1983 అసెంబ్లీ ఎన్నికలు మొదలు 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు హిందూపురంలో టిడిపి అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.
దీంతో, తారకరత్నను హిందూపురం నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా తారకరత్న హిందూపురం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది తేలాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.