ఈ నెలాఖరుకు తన పదవి నుంచి రిటైర్ కావాల్సిన ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి అధికార పక్షానికి నచ్చని మాట చెప్పారు. ఈ నెల 31న ఆయన పదవీకాలం ముగుస్తుంది. పట్టుబట్టి పంచాయితీ.. మున్సిపల్ ఎన్నికల్ని నిర్వహించిన ఆయన.. మిగిలి ఉన్న జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల్ని మాత్రం నిర్వహించలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయలేనని చెప్పారు.
ఏపీ అధికారపక్షం వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్లుగా సాగిన ఎపిసోడ్ లో.. ప్రతి సందర్భంలోనే నిమ్మగడ్డ తన అధిక్యతను ప్రదర్శించుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏపీ అధికారపక్షం సిద్ధంగా లేని వేళ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్ని నిర్వహించాలని పట్టుబట్టి నిర్వహించారు. చివరకు అధికార వైసీపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
దీంతో.. మిగిలి ఉన్న ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల్ని కూడా నిర్వహించాలన్న వాదన వినిపించింది. తన రిటైర్మెంట్ కు తక్కువ సమయం మిగిలి ఉన్నందున.. ఇంత స్వల్ప వ్యవధిలో నోటిఫికేషన్ విడుదల చేయటానికి ఆయన ఆసక్తిని చూపించలేదు. తాజాగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందన్నారు.
హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తానీ ఆదేశాలు ఇస్తున్నట్లు నిమ్మగడ్డ చెప్పారు. ఇక.. ఇటీవల ముగిసిన పంచాయితీ.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్.. ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పని చేసినట్లు చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. రాష్ట్రంలో కూడా పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలన్నారు. మరి.. నిమ్మగడ్డ సూచనపై ఏపీ సర్కారు ఏ తీరులో రియాక్టు అవుతుందో చూడాలి.