పీలేరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నగరమంతా పసుపుమయమైంది. టీడీపీ ఫ్లెక్సీల చించివేత ఘటన నేపథ్యంలో అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేసిన పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు పీలేరు సబ్ జైలుకు చంద్రబాబు వచ్చారు. టీడీపీ కార్యకర్తలతో మాట్లాడిన బాబు వారికి ధైర్యం చెప్పారు. కేసులకు భయపడవద్దని, వారందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. తెగించి పోరాడితే టీడీపీదే విజయం అని ధైర్యం చెప్పారు.
చంద్రబాబు రాక నేపథ్యంలో పీలేరు సబ్ జైలు వద్దకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. చంద్రబాబు కాన్వాయ్ పై పూల వర్షం కురిపించి జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తాం అని చంద్రబాబు తీవ్రస్వరంతో మండిపడ్డారు. టీడీపీ ఫ్లెక్సీలు ఎందుకు చించివేశారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ఫైర్ అయ్యారు. పోలీసులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
అమాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భయపెట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని, తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా? అని నిలదీశారు. సీఐ, ఎస్సై చాలా దారుణంగా వ్యవహరించారని, టీడీపీ కార్యకర్తలు పండుగ జరుపుకోకుండా జైల్లో పెడతారా అని హెచ్చరించారు. అటువంటి పోలీసులు మూల్యం చెల్లించుకోకతప్పదు అని వార్నింగ్ ఇచ్చారు.
కాగా, చంద్రబాబు కాన్వాయ్ లోని వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. తాను పీలేరు రాకుండా అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. పోలీసు యాక్ట్ 30 పెడతారా? అంటూ ప్రశ్నించారు. ఎవరికీ భయపడేది లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించే పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. 60 వేల మంది పోలీసు సిబ్బంది ఉంటే నాకు 60 లక్షల మంది సైన్యం ఉందని హెచ్చరించారు. తాను పిలుపునిచ్చి జైలుకు పోవాలని చెబితే తమ వాళ్లను పెట్టేందుకు జైళ్లు చాలవని అన్నారు.