జనవరి 12.. వీరసింహారెడ్డి
జనవరి 13.. వాల్తేరు వీరయ్య
జనవరి 14.. అంబటి రాంబాబు
..ఈ సినిమా ఎక్కడిదా అనుకోకండి. ఎలాంటి ట్రైలర్లు, ప్రీరిలీజ్ ఈవెంట్స్ లేకుండా డైరెక్టుగా రిలీజ్ అయిపోయిన సినిమా ఇది. పైగా ఎవరికెన్ని థియేటర్లు అనే పంచాయతీ లేదు.. టికెట్ల ధరలు తగ్గింపు, పెంపు సమస్య లేదు.. డైరెక్టుగా పబ్లిక్‌లోనే భోగీ రోజు ఉదయాన్నే రిలీజ్ అయిపోయిన డ్యాన్స్ కామెడీ షో ఇది.
అవును భోగీ సందర్భంగా ఏపీలోని సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు తన డ్యాన్స్‌తో సందడి చేశారు. చుట్టూ బంజారా సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు.. మధ్యలో భోగీ మంటలు.. ఇక మంత్రిగారికి ఫుల్ జోష్ వచ్చేసింది. భోగి మంట చుట్టూ బ్రేక్ డ్యాన్స్ చేసేశారు అమాత్యులవారు.
అన్నట్టు… గత ఏడాది కూడా మంత్రి రాంబాబు భోగీకి చిన్న స్టెప్ వేశారు. కానీ, ఈసారి మాత్రం పావు గంట పాటు అదరగొట్టేశారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు తెచ్చిన ఊపో.. లేదంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో నాటునాటు అందకున్న అప్లాజ్ మహాత్మ్యమో… మంత్రిగారిని ఏం ఇన్స్పైర్ చేసిందో తెలియదు కానీ స్టెప్లతో అదరగొట్టేశారు.
డప్పు చప్పుళ్ల మధ్య, హుషారెక్కించే డీజే శబ్దాల మధ్య జాగింగ్ డ్రెస్‌లో జల వనరుల మంత్రి చేసిన ఈ భోగీ డ్యాన్స్ చూసిన ఆయన ఫ్యాన్స్ సార్ జుత్తు ఒక్కటి తెల్లగా ఉంది కానీ కుర్రాడే అని అనుుకుంటున్నారు. అన్నట్లు మనలో మన మాట… రాంబాబు సార్ కూడా కొద్దినెలల కిందట వరకు జుత్తుకు రంగు వేయించేవారు. కానీ, ఆడియో లీకులు.. అవీఇవీ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆయన పెద్దతరహాలో కనిపించడానికి జుత్తుకు రంగు వేయించడం మానేశారు. మళ్లీ పండగ సందర్భంగా తనలో కుర్రతనాన్ని తట్టిలేపారాయన.