జగన్ హయాంలో కమ్మ సామాజిక వర్గం టార్గెట్ కు గురైందని, అందుకే అమరావతిని జగన్ నిర్వీర్యం చేశారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ క్యాబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి, మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కమ్మ సామాజిక వర్గానికి జగన్ అన్యాయం చేస్తున్నారని నాగేశ్వరరావు చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపాయి.
తన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ కు మంత్రి పదవి దక్కలేదన్న కారణంతోనే వసంత నాగేశ్వరరావు ఈ విధంగా మాట్లాడారని గతంలో టాక్ వచ్చింది. అంతేకాదు, నాగేశ్వరావు కామెంట్ల వెనుక వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారని, ఆయన కూడా జగన్ పై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరిగింది. దీంతో, వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మైలవరంలో తాజాగా వెలసిన ఒక ఫ్లెక్సీ తీవ్ర చర్చనీయాంశమైంది.
వీరసింహారెడ్డి చిత్రం విడుదల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ల ఫ్లెక్సీ ఒకటి రాజకీయ దుమారం రేపుతోంది. వెలగూరులో ఈ ఫ్లెక్సీని ఆ గ్రామానికి చెందిన వైసిపి నేత చల్లా అజయ్ కుమార్ ఏర్పాటు చేయడం విశేషం. అయితే, తాను బాలయ్య అభిమానిని అని, అందుకే ఎమ్మెల్యే ఫోటోతో కలిపి ఫ్లెక్సీ ఏర్పాటు చేశానని అజయ్ అంటున్నారు. ఎమ్మెల్యేకు, ఈ ఫ్లెక్సీకి, పార్టీకి, రాజకీయాలకు సంబంధం లేదని చెబుతున్నారు.