ఏపీ సరికొత్త రాజకీయాన్ని చూస్తోంది. అధికార పక్షానికి చెందిన నేతల్ని సామాన్యులు అప్పుడప్పుడు ప్రశ్నించటం చూస్తుంటాం. అలా ప్రశ్నించిన వారిని సముదాయించటం.. వారి డిమాండ్లు తీరేలా చేసే ధోరణి ఇప్పటివరకు చూశాం. అందుకు భిన్నంగా.. ప్రశ్నించే వారు ఎవరైనా సరే.. వారి సంగతి చూడాల్సిందే. పల్లెత్తు మాట అన్నా ఫలితం అనుభవించాల్సిందే అన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉందన్న వాదనకు తగ్గట్లే.. బెజవాడ రాణివారి తోటలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు షాకింగ్ గా మారాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ ను వెంటేసుకొని వెళ్లిన వైసీపీ నేత దేవినేని అవినాశ్ కు ఒక మహిళ కారణంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావటం తెలిసిందే.
తన ఇంటి మీద తెలుగుదేశం జెండా ఎగిరేసి ఉన్న వైనాన్ని ఆయన అడిగితే.. స్థానిక కార్పొరేటర్ తమను మోసం చేశాడంటూ ధైర్యం సమాధానం ఇచ్చింది. తమ సమస్యల్ని పరిష్కరించే వారి వెంటే ఉంటామని తేల్చింది. అందుకే తెలుగుదేశం పార్టీ జెండాను తన ఇంటి మీద ఎగురవేసినట్లుగా పేర్కొంది. ఈ సందర్భంగా మారు మాట్లాడకుండా.. మౌనంగా ఉన్న దేవినేని అవినాశ్ అక్కడి నుంచి వెళ్లిపోవటం.. మీడియాలో ప్రముఖంగా వచ్చింది.
కట్ చేస్తే.. మీడియాలో ఈ వార్త వచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన సమస్యల్ని ధైర్యంగా చెప్పుకొని.. స్థానిక కార్పొరేటర్ రామిరెడ్డి తీరును తప్పు పట్టిన ఒంటరి మహిళ ఇంటిపైకి మంగళవారం వైసీపీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్న పదిహేను మంది మహిళలు.. ఐదుగురు పురుషులు రావటం.. తమ వెంట రాళ్లు.. కారం పాకెట్లు తీసుకొచ్చి దౌర్జన్యం చేయటం షాకింగ్ గా మారింది.
దేవినేని అవినాశ్ అనుచరులుగా సుపరిచితులైన వైసీపీ మాజీ కార్పొరేటర్ దామోదర్.. గుడివాడ చిన్నారి.. బచ్చు మాధవి.. విజయలక్ష్మితో సహా దాదాపు 20 మందికి పైనే ప్రశ్నించిన రమీజా ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆమెను బండబూతులు తిడుతూ పదిహేను మంది మహిళలు చుట్టుమట్టి కొడుతూ.. దేవినేని అవినాష్ నే ప్రశ్నిస్తావా? అంటూ విరుచుకుపడ్డారు. రమీజా మీద జరుగుతున్న దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానిక మహిళలపైనా బెదిరింపులకు దిగారు. కళ్లల్లో కారం చల్లి.. ఇంట్లో సామాన్లను ధ్వంసం చేశారు. దాడి గురించి తెలిసినంతనే రమీజా బంధువులు ఇంటి వద్దకు చేరుకునే సమయానికి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దీంతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో పాటు.. టీడీపీకి చెందిన పలువురు బాధితుల పక్షాన నిలిచారు. దాడిని తీవ్రంగా ఖండించారు. అయితే.. దాడి చేసిన ఉదంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేస్తున్నా.. స్థానిక పోలీసులు మాత్రం దాడి చేసిన మహిళలపై కాకుండా.. బాధిత మహిళ.. ఆమెకు అండగా నిలిచిన వారిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు.. బాధిత మహిళ తమ పార్టీకే చెందినదిగా వైసీపీ నేతలు ప్రకటించటం గమనార్హం. ఇక.. ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని అవినాశ్ ఈ వ్యవహారంపై రియాక్టు అయ్యారు. తాను గడప గడపకు ప్రోగ్రాం చేస్తుంటే టీడీపీ వారు కావాలనే వ్యూహాత్మకంగా మహిళల్ని ఏర్పాటు చేసి ప్రశ్నించేలా చేశారని.. ఆ తర్వాత వారే కారంపొడితో దాడి చేసినట్లుగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏమైనా.. బెజవాడ వరకు వైసీపీ నేత దేవినేని అవినాశ్ ను ఎవరైనా ప్రశ్నిస్తే ఏం జరుగుతుందన్న దానికి నిదర్శనంగా తాజా పరిణామం ఉందన్న మాట వినిపిస్తోంది.