నందమూరి కుటుంబం నుంచి అన్నగారి తనయుడిగా ఆయన రాజకీయ వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. హరికృష్ణ మరణం తర్వాత బాలకృష్ణ ఒక్కరే ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోని నందమూరి తారకరత్న కొద్ది రోజులుగా టీడీపీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ పుకార్లకు ఊతమిచ్చే విధంగానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో తారకరత్న భేటీ అయ్యారు. లోకేష్ ను ఆయన నివాసంలో కలిసిన తారకరత్న కుటుంబపరమైన విషయాలతోపాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు. గతంలో టిడిపి తరఫున ప్రచారం చేసిన తారకరత్న రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. లోకేష్ తో భేటీలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. టీడీపీకి నందమూరి కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని లోకేష్ కు తారకరత్న చెప్పినట్టుగా తెలుస్తోంది. తారకరత్న పోటీ చేయడం ఖాయమని, కానీ, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని టిడిపి వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
మరోవైపు, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులను నిరసిస్తూ టిడిపి చేపట్టిన చలో కావలి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంపై లోకేష్ మండిపడ్డారు. చలో కావలి కార్యక్రమాన్ని అణచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్ అన్నారు. అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకపోవడం జగన్ సైకో పాలనకు పరాకాష్ట అని లోకేష్ విమర్శించారు. రాజుతో పాటు మిగతా వారిపై ఉన్న కేసులు ఉపసంహరించుకొని తక్షణం వారిని విడిచిపెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు.