జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపీ నేతలకు వరుసగా షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లిన ప్రతి చోటా వారికి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను మహిళ లు నిలదీస్తున్న వైనం అధికార పార్టీకి ఇరకాటంగా మారింది. జనం గడప తొక్కుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాశ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవినాశ్ ను ఒక మహిళ నిలదీసింది. రాణిగారితోట ప్రాంతంలో కార్పొరేటర్ రామిరెడ్డి, ఇతర నేతలతో కలిసి అవినాశ్ వెళ్తుండగా కొందరు స్థానిక మహిళలు వారిని అడ్డుకున్నారు. అవినాశ్ తోపాటు వైసీపీ నేతలపై ఆ మహిళలు మండిపడ్డారు. పార్టీ కోసం, నేతల కోసం పని చేశామని, వారి వెనుక తిరిగామని ఆవేశపడ్డారు. అయినా సరే, నేతలు తమకేం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు మాకేం చేశారని అవినాశ్ తోపాటు మిగతా నేతలను వారు నిలదీశారు. కార్పొరేటర్ రామిరెడ్డి తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సంభాషణ జరుగుతుండగా…రమీజా అనే మహిళ ఇంటిపై టీడీపీ జెండా ఉండటాన్ని అవినాశ్ గమనించారు. ఈ జెండా మనం పెట్టిందేనా? అని రమీజాను ఆయన ప్రశ్నించారు. అయితే, ఆ ప్రశ్నకు రమీజా అనూహ్యమైన సమాధానమివ్వడంతో అవినాశ్ షాకయ్యారు. మీరు గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ జెండాను పెట్టామంటూ రమీజా చెప్పడంతో అవినాశ్ తోపాటు వైసీపీ నేతలంతా ఖంగు తిన్నారు. ఆమెకు ఏం చెప్పాలో తెలియక అవినాశ్ సైలెంట్ గా అక్కడి నుంచి జారుకున్నారు.