వైసీపీ నేత, రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావుపై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. భారీ భూ కుంభకోణాలకు ధర్మాన ప్రసాదరావు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఆరోపణలపై ధర్మాన స్పందించారు. మంత్రిగా తనకు సెంటు భూమి కూడా కేటాయించే అధికారం jకూడా లేదంటూ ధర్మాన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. అటువంటి తనకు భూములు దొబ్బే అవకాశం ఉంటుందా? అని ధర్మాన ప్రశ్నించారు.
భూములు కేటాయించగల అధికారం కేవలం కేబినెట్ కే ఉంటుందని అన్నారు. అంతేకాదు, అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేశారు. తమ ప్రభుత్వం అభివృద్ధి చేయడంలేదని తమకు శత్రువులుగా ఉన్న కొన్ని టీవీ చానళ్లు… ధర్మాన అవినీతికి పాల్పడ్డాడంటూ కథనాలు ప్రసారం చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ మినిస్టర్ భూములు దొబ్బాడని ఆరోపణలు చేస్తుంటారని, కానీ, రెవెన్యూ మంత్రికి భూములు దొబ్బే అవకాశం ఉండదని అన్నారు.
పత్రికల్లో తనపై వచ్చే ఆరోపణలకు తానిచ్చే సమాధానం ఆ పత్రికల్లో రాదని చెప్పుకొచ్చారు. అవి చూసి ప్రజలు తాము అవినీతిపరులనుకుంటున్నారని అన్నారు. ఒక్క రూపాయి తీసుకున్నానని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాను అన్నానని, కానీ, ఆ మాట ఆ పత్రికల్లో రాదని చెప్పారు. తన దగ్గర ఓ రిపోర్టర్ ను పెడతారని, తాను చెప్పిన మాటలను అటూ ఇటూ కత్తిరించి మధ్యలో ఉన్న మేటర్ ను పెడతారని చెప్పారు. అలా వచ్చినందుకు పాపం ఆ రిపోర్టర్ కూడా ఏమీ చేయలేడని, యాజమాన్యం వద్ద అతడో ఉద్యోగి మాత్రమేనని ధర్మాన అన్నారు.