విజయవాడ లోక్‌సభ స్థానానికి టీడీపీ టిక్కెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సిటింగ్ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల మధ్య పోటీ కాస్తా అక్కడ ఇతరులకు అవకాశంగా మారుతోంది. ముఖ్యంగా టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వేదిక కానుందనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ లోక్ సభ సీటు విషయంలో సుజనా ఇప్పటికే చంద్రబాబు నుంచి గట్టి హామీ సంపాదించుకున్నారని చెప్తున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం తరువాత సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్‌లు బీజేపీలో చేరారు. పేరుకు వారు బీజేపీలో చేరినా రాజకీయమంతా టీడీపీతోనే ముడిపడి ఉంటుందన్నది కాదనలేని సత్యం. 2019 వైసీపీ గాలిని తట్టుకుని నిలిచి టీడీపీ గెలిచిన సీట్లలో విజయవాడ లోక్ సభ సీటు కూడా ఒకటి.
టీడీపీకి కంచుకోటగా చెప్పే విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తే విజయం నల్లేరు మీద నడకే అవుతుందన్నది సుజనా చౌదరి అంచనా. ఆ లెక్కలతోనే ఆయన విజయవాడ సీటుపై కన్నేసినట్లు చెప్తున్నారు.
సాధారణ పరిస్థితుల్లో అయితే కేశినేని నానిని కాదని సుజనా కూడా సీటు అడిగే పరిస్థితి ఉండదు.. కానీ, ఇప్పుడు అక్కడ నాని, చిన్నిల మధ్య పంతం నెలకొనడం మొత్తానికి మోసం జరగకుండా మూడో వ్యక్తికి ఇవ్వడం ఉత్తమం అనే ఆలోచనలో ఉంది పార్టీ కూడా. ఇది సుజనా చౌదరికి కలిసొచ్చిందని చెప్తున్నారు.
బీజేపీ, టీడీపీ పొత్తులు కనుక ఉంటే బీజేపీలోనే ఉంటూ పొత్తుల్లో భాగంగా విజయవాడ నుంచి సుజనా పోటీ చేసే అవకాశం ఉంది. లేని పక్షంలో ఆయన ఎన్నికలకు ముందు పాత గూడు టీడీపీలోకి చేరి విజయవాడ నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరవర్గం చెప్తోంది.
సుజనా కనుక విజయవాడ నుంచి పోటీ చేస్తే ఆయన కృష్ణాజిల్లాలో టీడీపీ విజయానికి ఆర్థికంగానూ దన్నుగా ఉండొచ్చు. పైగా విజయవాడ టీడీపీలోని అన్ని వర్గాలను తనకు అనుకూలంగా మలచుకునే చాకచక్యం ఆయనకు ఉందంటున్నాయి టీడీపీ శ్రేణులు.