హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. టాలీవుడ్ హీరోయిన్ నేహా దేశ్ పాండే భర్త మైరాన్ మోహిత్ తోపాటు ఏపీకి చెందిన మాజీ మంత్రి బంధువు, వ్యాపారవేత్త కృష్ణ కిశోర్ రెడ్డిన పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ ఇచ్చిన సమాచారంతో మైరాన్, కృష్ణ కిశోర్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో ప్రముఖ డీజేగా, ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్ గా గుర్తింపు పొందిన మైరాన్ మోహిత్… దేశంలో అనేక చోట్ల డీజే పార్టీలు, ఈవెంట్లు నిర్వహించేవాడు.
డీజే ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్నాడని,గత 12 ఏళ్లుగా డ్రగ్స్ ధందాలో కీలకపాత్ర పోషిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముంబై కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ ను నడిపిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. టాలీవుడ్, బాలీవుడో, కోలీవుడ్ లోని వ్యక్తులతోనూ, వ్యాపారవేత్తలతోనూ పరిచయాలున్నట్టు భావిస్తున్నారు. హైదరాబాద్ సహా గోవా, ముంబై నగరాల్లో డ్రగ్స్ సరఫరా చేసేవారితో మోహిత్‌కు పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు వందకు పైగా డీజేలను తన లిస్టులో పెట్టుకుని గోవాతో పాటు దేశంలోని పలు నగరాల్లో డీజేలు నిర్వహిస్తూ ఆ డీజే షోల ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ కిశోర్ రెడ్డి పలు కాంట్రాక్టులు చేస్తుంటారని తెలుస్తోంది. ఎడ్విన్, మైరాన్ మోహిత్ లతో పరిచయం పెంచుకున్న కృష్ణ కిశోర్ రెడ్డి వారి ద్వారా ఇతర వ్యాపారవేత్తలకు, సినీ ప్రముఖులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. కెఎంసి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న కృష్ణ కిషోర్ రెడ్డి ప్రముఖ బిల్లర్ గా కొనసాగుతూ తెలంగాణ, ఏపీలో కాంట్రాక్ట్ లు నిర్వహిస్తున్నారు.