తెలుగుదేశం పార్టీ ఇటీవలే ఒక పెద్ద విషాదాన్ని చూసింది. నెల్లూరు జిల్లా కందుకూరులో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో సందర్భంగా పరిస్థితులు అదుపు తప్పడం.. ఇరుకు రోడ్డులో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది కార్యకర్తలు ప్రాణాలు వదలడం సంచలనం రేపింది. బాధిత కుటుంబాలను టీడీపీ అన్ని విధాలుగా ఆదుకుంటున్నప్పటికీ.. రోడ్ షో నిర్వహణ లోపాల మీద విమర్శలు వచ్చాయి.
ఈ విషయంలో ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఆ చర్చ ఇంకా కొనసాగుతుండగానే.. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఓ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.
గుంటూరులోని వికాస్నగర్లో టీడీపీ ఎన్నారై విభాగం కార్యక్రమంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేపట్టారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రభుత్వం తరఫున పేదలకు సంక్రాంతి కానుక ఇచ్చేవారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఈ కార్యక్రమం చేపట్టి పేదలకు సాయం చేయాలని టీడీపీ ఎన్నారై విభాగం భావించింది. ఐతే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట చోటు చేసకుంది.
ఈ క్రమంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆసుపత్రిలో చికి్త్స పొందుతూ ఇంకో ఇద్దరు మహిళలు ప్రాణాలు వదిలారు. పలువురికి గాయాలయ్యాయి. సభా ప్రాంగణంలో ఉన్నట్లుండి తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. సభా నిర్వాహకులపై స్థానికులు మండిపడుతున్నారు. కందుకూరి ఘటన జరిగి వారం తిరక్కముందే టీడీపీకి సంబంధించిన కార్యక్రమంలో మరో విషాదం చోటు చేసుకోవడం పార్టీకి ఇబ్బంది కలిగించేదే.