అయ్యప్ప స్వామిపై భారత నాస్తిక సంఘం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేేపిన సంగతి తెలిసిందే. బైరి నరేశ్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందువులను కించపరిచేలాగా మాట్లాడిన నరేశ్ పై పలు హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నరేశ్ కు కొందరు దేహశుద్ధి చేసినట్టు కూడా తెలుస్తోంది.
మరోవైపు, నరేశ్ వ్యాఖ్యలకు నిరసనగా అయ్యప్పదీక్షధారులు ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా బైరి నరేశ్ ను వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నరేశ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బైరి నరేశ్ ను అరెస్ట్ చేశామని, అయ్యప్పస్వాములు ఆందోళనలు విరమించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో నరేశ్ పోస్టులు పెట్టడం మరో వివాదానికి దారి తీసింది. ఇక, పరారీలో ఉన్న సమయంలో ఆ సమర్థన వీడియోలు పోస్టు చేసినట్టు తెలుస్తోంది. నరేశ్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అతడి ఆచూకీని పోలీసులు గుర్తించి ఖమ్మం నుంచి వరంగల్ వెళుతుండగా అతడిని అరెస్ట్ చేశారు.
మరోవైపు, బైరి నరేశ్ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఖండంచారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అలా చేసేవారిని ఉపేక్షించేది లేదని, తగిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని తలసాని హితవు పలికారు.