ఆంద్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయంలో డ్యూటీలో ఉన్నప్పుడు తమ వద్ద 1000 రూపాయలకు మించి డబ్బు ఉంచుకోకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వేళ ఉద్యోగి తన విధి నిర్వహణలో భాగంగా ఏదైనా పర్యటనలో ఉన్నట్లయితే ఆ ఉద్యోగి తన వద్ద రూ.10 వేల వరకు నగదు ఉంచుకోవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులు ఉద్యోగ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వానికి, ఉద్యోగ వర్గాలకు మధ్య అగాధం ఏర్పడుతోంది. ఉద్యోగ వర్గాలకు కంఠగింపుగా ఉండే కొన్ని వివాదాస్పద నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది ఉద్యోగ వర్గాలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. పీఆర్సీ ప్రకటించినప్పటి నుంచీ ప్రభుత్వానికి, ఉద్యోగ వర్గాలకు మధ్య సఖ్యత కుదరడం లేదు. పీఆర్సీపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి పెద్ద ఎత్తున ఛలో బెజవాడ కార్యక్రమం నిర్వహించారు. అప్పటి నుంచీ ఉద్యోగులు, ప్రభుత్వ వర్గాలకు మధ్య ఎక్కడో తెలీని అగాథం కనిపిస్తూ వస్తోంది.
తదనంతర పరిణామాల్లో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న కొన్ని నిర్ణయాలను కొన్ని ఉద్యోగ సంఘాలు కక్షసాధింపు చర్యలుగా పరిగణించాయి. ప్రధానంగా ప్రభుత్వ టీచర్లకు ముఖ హాజరీ, యాప్ల నిర్వహణ, బదిలీలు తదితర అనేక ఉత్తర్వులు టీచర్లకు అసంతృప్తిని కలిగించాయి. ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని వైసీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్వయంగా చెప్పడం కలకలం సృష్టించింది.
*???? ఉద్యోగస్తులు అందరు విధి నిర్వహణలో కార్యాలయాల్లో ఉన్నప్పుడు 500 నుండి 1000 రూపాయలు మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలి* దానికి సంబంధించినటువంటి జీవో.
పిచ్చి పీక్ కి వెళ్ళిపోయింది. pic.twitter.com/6m6knhWgsT— సాగర్ పల్నాటి (@jsppalnatisagar) December 30, 2022
ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచీ తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయులు ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే భయంతో నే ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు మిగిలిన సాధారణ ఉద్యోగ వర్గాలను కూడా ప్రభుత్వం వదలిపెట్టడం లేదు. అందరికీ ముఖ హాజరు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు ముఖ హాజరీ పడకపోతే జీతంలో కోత విధిస్తామని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల పట్ల ఉద్యోగ వర్గాలు లోలోన రగలిపోతున్నట్లు సమాచారం.
ఇప్పుడు తాజాగా ఉద్యోగులు కార్యాలయాల్లో విధుల్లో ఉన్నప్పుడు తమ జేబుల్లో కేవలం రూ.1000లు మాత్రమే ఉంచుకోవాలని జారీ చేసిన ఉత్తర్వులు ఉద్యోగులకు మరింత అసంతృప్తికి గురి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ ఆదేశాలను సమర్థించుకుంటున్నాయి. గతంలో ఉన్న నిబంధనలను సడలించామని ప్రభుత్వం తెలియజేసింది. గతంలో ఉద్యోగి కేవలం తన జేబులో రూ.500లకు మించి ఉండరాదని నిబంధన ఉంటే ప్రభుత్వం ఉద్యోగులకు ఊరట కల్పించేలా ఆ పరిమితిని రూ.1000కి పెంచిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.