మన జేబులోది కాకుంటే ఏదైనా ఇచ్చేసే పెద్ద మనసు కొందరిలో ఉంటుంది. మరికొందరు మహానుభావులు మాత్రం అందుకు భిన్నం. కావాలంటే తమది ఇచ్చేస్తారు కానీ.. పరుల సొమ్ము పాములాంటిదని భావిస్తారు. పక్కనోడి రూపాయిని కాపాడటం కోసం తమ సొంతంగా రెండురూపాయిలు ఖర్చు చేసే పుణ్యాత్ములు చాలామందే ఉన్నారు. ప్రజల సొమ్ముకు కస్టోడియన్లుగా ఉండాల్సిన పాలకులు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లోకి వెళ్లిపోయి.. సంక్షేమం పేరుతో ఇష్టారాజ్యంగా జీతాలు పెంచేసే తీరు చూస్తే.. ఆగ్రహం కలుగక మానదు.
పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండి వసూలు చేసే ప్రభుత్వాలు.. ఆ సొమ్మును భద్రంగా ఉంచటమే కాదు.. ఆచితూచి అన్నట్లుగా ఖర్చు పెట్టాలి. అందుకు భిన్నంగా తాజాగా కేసీఆర్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 30 శాతం ఫిట్ మెంట్ చూస్తే.. నోట మాట రాదంతే. అంటే.. వెయ్యి రూపాయిలు జీతం ఉన్న వారికి ఏకాఏకిన రూ.300 పెంచేయటమే కాదు.. మిగిలిన వాటిల్లో పెరిగే మొత్తం కలిపితే.. మరికాస్త ఎక్కువ అవుతుంది. ఇంత భారీగా జీతాలు పెంచటం తప్పేం కాదు. కానీ.. ఎప్పుడు? రాష్ట్రం సుభిక్షంగా ఉన్నపుడు. అంతేగాని నెల గడవాలంటే అప్పుల మోత మోగేటప్పుడు.. నగదు కోసం ఆస్తుల్ని పెద్ద ఎత్తున అమ్ముతున్న వేళలో కాదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వేళలో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి.. తాజా పరిస్థితి ఎంతలా మారిందన్నది అందరికి తెలిసిందే. అప్పు చేసి పప్పు కూడు అన్న చందంగా ఆరేళ్ల వ్యవధిలో అప్పులు ఎంతలా పెరిగిపోయాయో తెలిసిందే. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచేస్తూ.. గుప్పెడు మంది సంతోషం కోసం కోట్లాది మందిని ఇబ్బంది పెట్టటం ఎంతవరకు సబబు? అంతేనా.. ప్రభుత్వాధినేతగా ఉన్న కేసీఆర్.. తన ఉద్యోగులకు పెద్ద మనసుతో వరాన్ని ఇస్తే ఇలా తప్పుపడతారా? అని మమ్మల్ని తిట్టిపోయొచ్చు.
కానీ.. ఇక్కడో విషయాన్ని మర్చిపోకూడదు. ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్ కు సొంత పత్రిక.. టీవీ చానల్ ఉన్నాయన్నది మర్చిపోకూడదు. మరి.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్ని ఇంతలా పెంచేసిన కేసీఆర్.. తన దగ్గర పని చేసే నమస్తే తెలంగాణ ఉద్యోగులకు సైతం ఇదే స్థాయిలో జీతాలు పెంచేయగలరా? అంతటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోగలరా? మంది సొమ్ము కాబట్టి పప్పు బెల్లాల మాదిరి పంచేస్తున్న సారూ.. తన సొంత పత్రికలో పని చేసే ఉద్యోగుల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జీతాలు ఇవ్వటంలో మర్మమేంటి? సారు దొడ్డ మనసు ప్రభుత్వ ఉద్యోగుల మీదనేనా? తన ఇంటి సంస్థలో పని చేసే వారి మీదా ఉండదా? అన్నది కొందరికి వస్తున్న ధర్మసందేహం. దాన్ని తీర్చేవారెవరు?