చంద్రబాబు ఖమ్మం సభ తరువాత ఆ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.
నేతల తీరులోనూ మార్పు కనిపిస్తోంది. పాత గూటికి చేరేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తుండగా మరికొందరు నేరుగా ఇప్పుడున్న పార్టీలపై అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు.
తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తాను ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది.
బీఆర్ఎస్ నేతలు సొంత పార్టీకి చెందినవాడినే అయినా తనపై కుట్రలకు పాల్పడుతున్నారని సండ్ర ఆరోపించారు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు సండ్ర.
తాను నిజానికి టీడీపీని వీడాలనుకోలేదని.. ఆ పార్టీలో పెద్దలంతా పార్టీని వీడాకే తాను వీడానని ఆయన గుర్తు చేశారు.
టీడీపీ కోసం తాను ఎన్నో కేసులనూ ఎదుర్కొన్నానని సండ్ర చెప్పారు.
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో సండ్ర వెంకటవీరయ్యకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంతో పొరపొచ్చాలున్నాయి. నిజానికి సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఏమీ బలమైన పార్టీ కాదు.
ఇక్కడ గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్(టీఆర్ఎస్) నుంచి పిడమర్తి రవి పోటీ చేశారు. రెండుసార్లూ ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పిడమర్తి రవి కూడా పొంగులేటి వర్గంలో చేరినట్లు చెప్తున్నారు.
మరోవైపు పొంగులేటి తన అనుచరుడు దయానంద్‌కు సత్తుపల్లి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ చేస్తుండడం.. ఖమ్మంలో సభ నిర్వహించడంతో సండ్ర మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.