2024 ఎన్నికలకు అధికారికంగా అయితే మరో ఏడాదిన్నర గడువుంది. దీంతో, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచి రాబోయే ఎన్నికలకు సన్నాహాలు మొదలుబెట్టాయి. ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చే అవకాశముందంటూ వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు జగన్ , చంద్రబాబు, పవన్ లు లీకులిస్తుండడం కూడా చర్చనీయాంశమైంది. ఏపీలో ప్రధానంగా వైసీపీ, టీడీపీల మధ్యే పోల్ వార్ జరగబోతోన్నప్పటికీ…జనసేనకూ కొద్దోగొప్పో అవకాశాలుండే పరిస్థితి కనిపిస్తోంది.
అయితే, తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదంటూ సజ్జల వంటి నేతలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, ముందస్తు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలని చంద్రబాబు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ కు డ్యామేజీ భారీగా జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జోస్యం చెప్పారు. అంతేకాదు, జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఆయన ముఖ్యమంత్రి పదవి ముందే ఊడిపోతుందంటూ ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లి జగన్ ముందే పదవి కోల్పోతే రాష్ట్రానికి మేలు జరుగుతుందని రామకృష్ణ అన్నారు. పరదాలు కట్టుకుని పర్యటించే జగన్.. పదవి పోతే బురఖా కప్పుకుని పోతారంటూ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ రూపంలోనూ నిరసన జరగకుండా పోలీసులను జగన్ కాపలా పెడుతున్నారని, ప్రజాస్వామ్య హక్కుల కోసం అంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఓ దళితుడిని హత్య చేసి, మృతదేహాన్ని బాధితుడి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చిన నేతకు వైసీపీ మద్దతు పలకడం దుర్మార్గమని రామకృష్ణ దుయ్యబట్టారు. సదరు ఎమ్మెల్సీకి బుద్ధి చెప్పాల్సింది పోయి, ఆయన చిత్ర పటానికి క్షీరాభిషేకాలు, సన్మానాలు చేయడమేంటని మండిపడ్డారు. దీని ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని వైసీపీ నేతలను ప్రశ్నించారు. అధికార పార్టీకి లొంగిపోయిన పోలీసులు కొందరు పోలీసు వ్యవస్థ పరువు తీస్తున్నారని దుయ్యబట్టారు.