తాజాగా తాను రంగా వారసుడినని మరోసారి ప్రకటించుకున్న వంగవీటి రాధా! నిజానికి ఆయన ఇలా ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పటికీ రంగా వారసుడే. కానీ, ఇలా ప్రకటించుకునే పరిస్థితిని కల్పించుకోవడం.. ఆయన చేస్తున్న పనుల కారణంగానే అని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయన టీడీపీ నేతగా ఉన్నారు. కారణాలు ఏవైనా..కూడా రంగా ఎవరిపై అయితే.. యుద్ధం చేశారో.. ఆ పార్టీలోనే ఇప్పుడు రాధా కొనసాగుతున్నారు.
ఇది కాపు సామాజిక వర్గానికి ఇష్టం లేదు. ఇది వాస్తవం. రాధాకు కూడా తెలియంది కాదు. ఎన్టీఆర్‌పై పోరు సల్పిన రంగా టీడీపీకి వ్యతిరేకంగా విజయవాడలో కాంగ్రెస్‌ను బలోపేతం చేశారు. అలాంటి నాయకుడి వారసుడిగా.. టీడీపీలోకి వెళ్లినప్పుడే.. పదే పదే తాను వారసుడనని.. చెప్పుకొనే పరిస్థితికిరాధా వచ్చేశారు. ఇక, ఇప్పుడు.. టీడీపీలో ఉంటూ.. వైసీపీ నేతలతో చెలిమి చేస్తున్నారు. ఇది తప్పుకాదని బుకాయిస్తున్నారు.
దీంతో టీడీపీలో ఉన్న రంగా అభిమానులకు ఇది నచ్చడం లేదు. దీంతో అసలు ఈయన వ్యవహారం ఏంటనేది టీడీపీలో చర్చకు వస్తోంది. పైకి చంద్రబాబు కానీ, ఇతర నేతలు కానీ మాట్లాడక పోయినా.. అంతర్గత చర్చల్లో మాత్రం రాధా విషయం హాట్ టాపిక్‌గానే మారుతోంది. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చెప్పిన పనులు కూడా చేయడం లేదు.
దీంతో ఆయన టీడీపీలో ఉన్నారా? లేదా.? అనేసందేహం కూడా రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ శివారులో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాధా.. వెంటనే తాను రంగా ఆశయాలు నిలబెడతానని.. ఆయన వారసుడిగానే ఉంటానని.. చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ.. ఏం చేస్తారో చెప్పలేదు. టీడీపీలోనే కొనసాగుతానని అనలేదు. మరి ఇలా అయితే.. రంగా వారసుడిగా రాధా చేస్తున్నది ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.