తగ్గింది.. మహమ్మారిని అధిగమించామన్న ఆనందం ఆవిరి అయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచన ఐదారు నెలలుగా కరోనా కేసులు అంతకంతకూ తగ్గిపోతున్న వేళ.. నార్మల్ గా పరిస్థితులు మారుతున్నాయన్న వేళలో కరోనా మహమ్మారి తన ఉనికిని చాటుతూ.. భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తున్నా.. అదంతా ఐదారురాష్ట్రాలకే పరిమితం కావటం తెలిసిందే.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు విద్యాసంస్థల్లోనూ.. హాస్టల్స్ లోనే టోకు కేసులు నమోదువు అవుతున్న వేళ.. ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని ఒక విద్యాసంస్థలో పెద్ద ఎత్తున కేసులు ఒకేసారి బయటకు రావటం షాకింగ్ గా మారింది.
రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని ఒక కాలేజీలో కరోనా కేసులు వస్తున్నాయి. మొదటి రోజు టెస్టు చేస్తే 13 కేసులు రాగా భయంతో రెండో రోజు మరిన్ని టెస్టులు చేయించారు. ఆ సందర్భంగా 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో.. ఊపిరి పీల్చుకున్న వారికి షాకిస్తూ.. తాజాగా జరిపిన టెస్టుల్లో ఏకంగా 140 మందికి పాజిటివ్ గా తేలటంతో అవాక్కు అయ్యే పరిస్థితి. మొత్తం 700 మంది విద్యార్థుల నుంచి నమూనాల్ని సేకరించిన యాజమాన్యంలో అందులో 140 మందికి పాజిటివ్ కావటంతో.. వారందరిని ఒక చోట ఉంచి.. మిగిలిన వారిని మరో క్యాంపస్ కు తరలించారు.
అంతేకాదు.. ఆ ప్రాంతం మొత్తాన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు.. మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వార్త తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లోని జేఎన్ టీయూకు దగ్గరగా ఉండే ఒక ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన హాస్టల్ లో 14మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలటం ఉలిక్కిపడేలా చేసింది. అయితే.. సదరు విద్యార్థుల వాదన ప్రకారం దాదాపు తమ క్యాంపస్ లో వంద మంది వరకు పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతున్నారు.
అయితే.. సిబ్బంది మాత్రం అంత లేదని కొట్టిపారేస్తున్నారు. ఏమైనా.. కరోనాకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విద్యా సంస్థల విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.