సోషల్ మీడియా దిగ్గజాలైన ట్విటర్.. ఫేస్ బుక్ తో పాటు సెర్చింజన్ అయిన గూగుల్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక మహిళకు సంబంధించిన విషయంలో వారు రాస్తున్న లేఖలకు స్పందించకపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకూ హైకోర్టు ఎందుకు నోటీసులు జారీ చేసిందన్న విషయంలోకి వెళితే..
టీనేజ్ లో ఉన్న వేళలో వారిద్దరు ప్రేమలో పడ్డారు. అతడి ప్రేమ ఆమెకు నచ్చలేదు. అదే సమయంలో ఆమెను బెదిరించి నగ్నఫోటోల్ని తీసుకున్నాడు. తర్వాత ఆమెకు పెళ్లైంది. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో తన కొడుకుతో ఉంటోంది. టీనేజ్ లో ఆమె ప్రేమ కోసం తహతహలాడిన అతడు మాత్రం మరోలా మారాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని గూగుల్ లోనూ.. సోషల్ మీడియాలోనూ అప్ లోడ్ చేసి టార్చర్ చేస్తున్నాడు.
2012లో ఇలానే చేసిన అతడి పోస్టుల్ని తొలగించారు. మళ్లీ 2019లో ఇలాంటి ఫోటోలు కనిపించాయి. దీంతో సోషల్ మీడియా సంస్థలతో పాటు గూగుల్ కు లేఖలు రాసి.. సదరు ఫోటోల్నితొలగించాల్సిందిగా కోరారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరినా స్పందించలేదు. దీంతో.. బాధితురాలి తల్లి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. తాను ఆ ఫోటోల్ని అప్ లోడ్ చేయలేదని.. మాజీ ప్రియుడు చెబుతున్నాడు.
దీంతో.. ఫోటోల్ని తొలగించేందుకు ఎన్ని లేఖలు రాసినా పట్టకపోవటంతో హైకోర్టును ఈ విషయంలో కలుగజేసుకోవలని కోరారు. దీంతో.. స్పందించిన కోర్టు.. సోషల్ మీడియా సంస్థలకు.. గూగుల్ కు నోటీసులు జారీ చేసింది. మాజీ స్నేహితుల కారణంగా సమాచారం దుర్వినియోగం కావటం.. గోప్యత విషయంలో ఆయా సంస్థలు తీసుకుంటున్న చర్యలు విషయంలో వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. బాధితురాలి లేఖపై ఎందుకు స్పందించలేదో చెప్పాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 30కు వాయిదా వేశారు.