టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు గోవా ప్రభుత్వం షాకిచ్చింది. గోవాలోని మాండ్రేమ్ గ్రామంలో నాగార్జున అక్రమంగా నిర్మాణం చేపట్టారని ఆ గ్రామ పంచాయతీ నాగార్జునకు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఆ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 211/2Bలో నాగార్జున కట్టుకుంటున్న ఇంటికి గ్రామ పంచాయతీ అనుమతి లేదని, ఆ నిర్మాణాన్ని తక్షణమే ఆపేయాలని సర్పంచ్ అమిత్ సావంత్ నోటీసులు జారీ చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
ఆ నిర్మాణాలు ఆపకుంటు గోవా పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ నాగార్జున దగ్గర ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఉంటే దానిని చూపించాలని ఆయన కోరారు. అయితే, నాగార్జున నటుడా? సెలబ్రిటీనా అన్న సంగతి తమకు తెలియదని, తాము చట్టబద్ధంగా కట్టే నిర్మాణాలకు వ్యతిరేకం కాదని అమిత్ అంటున్నారు. ఈ నోటీసులపై నాగార్జున స్పందించాల్సి ఉంది.
ప్రపంచ పర్యాటకులకు మన దేశంలోని గోవా ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం. అందులో నార్త్ గోవాలో మాండ్రమ్ గ్రామంలో ఉన్న బీచ్ పర్యాటకులకు స్వర్గధామం వంటిది. మన దేశంతో పాటు విదేశాల నుంచి కూడా వేలాది మంది పర్యాటకులు నిత్యం ఈ గ్రామంలో పర్యటిస్తుంటారు. ముఖ్యంగా రష్యా పర్యాటకులకు ఇది టూరిజం హబ్ లాంటిది. దీంతో, అక్కడ ఇల్లు కట్టుకోవాలని నాగ్ భావించాడు. అయితే, అనుకోకుండా ఇలా నాగ్ చిక్కుల్లో పడ్డాడు. మరి, ఈ నోటీసులపై నాగార్జున స్పందన ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.