వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానకు పోయినట్లు.. గతంలో ఎన్నో వివాదాలు, ఆరోపణలు వచ్చినా తట్టకుని నిలబడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. ఇప్పుడో చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతుండడంతో తన రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసుకునేలా కనిపిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక పేద కుటుంబానికి ఆధారమైన అనిల్ అనే కుర్రాడు ఒక హోటల్లో పారిశుద్ధ్య పనికి వెళ్లి చనిపోవడం.. ఇందుకు పరిహారంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కేటాయించిన రూ.5 లక్షల్లోంచి సగం డబ్బును లంచంగా అడిగారంటూ అంబటి రాంబాబు మీద తీవ్ర ఆరోపణలు రావడం దుమారం రేపింది. మంత్రి స్థాయికి ఇలా ఎందుకు కక్కుర్తి పడతారని ముందు సందేహాలు రేకెత్తినా.. ఆ తర్వాత స్వయంగా బాధితులు అంబటి తమతో ఎంత దారుణంగా వ్యవహరించాడో పూసగుచ్చినట్లు మీడియాకు వివరించడంతో అనుమానాలు బలపడ్డాయి.
ఈ వ్యవహారం మీద అంబటి మీడియా ముందుకు వచ్చి ఎంత సమర్థించుకుందామని చూసినా.. ఆయన వాదన నిలబడలేదు. ఈ ఆరోపణలు నిజం కాని పక్షంలో బాధితులకు ఎప్పుడు పరిహారం మంజూరైంది, వాళ్లకు ఎప్పుడు డబ్బులు ఇచ్చింది లేదా ఇవ్వబోతోంది అన్న వివరాల్లోకి వెళ్లి ఉండాలి. కానీ అంబటి ఆ టాపిక్కే రానివ్వకుండా ఎదురుదాడి చేశారు. ఆరోపణలు చేస్తున్న జనసేన మీద విరుచుకుపడుతున్నారు. గతంలో మహిళలతో సరస సంభాషణలు సహా పలు వివాదాల్లో అంబటి చిక్కుకున్నారు. కానీ అవేవీ ఆయన రాజకీయ ఎదుగుదలకు అడ్డంకి కాలేకపోయాయి. రెండోసారి కూడా ఆడియో లీక్ వివాదంలో చిక్కుకున్నా మంత్రి పదవిని అందుకోగలిగారు. ఇలా అడ్డంకులన్నీ దాటుకుని వచ్చిన అంబటికి ఇప్పుడు కేవలం రూ.2.5 లక్షల లంచం వ్యవహారం చుట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
బిడ్డను కోల్పోయి పరిహారం అందుకుంటున్న తల్లిదండ్రుల నుంచి లంచం ఆశించారనే ఆరోపణ అంబటి ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేస్తోంది. పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించి, దూషణలు చేసిన అంబటి ఇప్పుడీ వివాదంతో దొరికిపోవడంతో జనసేన వాళ్లు వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలట్లేదు. సోషల్ మీడియాలో అంబటికి చుక్కలు చూపించేస్తున్నారు. ఆరోపణలు నిజమైతే రాజీనామా చేస్తా అని ఆయన చేసిన సవాల్‌ను, బాధితుల వీడియోను పెట్టి రాజీనామా చేయాల్సిందే అంటూ ట్రెడ్ చేస్తున్నారు. వ్యవహారం నేషనల్ మీడియాకు కూడా ఎక్కేయడం గమనార్హం. మామూలుగా అయితే వైసీపీ తీరు ఇలాంటివి పట్టింంచుకోకుండా దులుపుకుని వెళ్లిపోవడమే. కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. ఇప్పుడిలాంటివి చూసీ చూడకుండా వదిలేయలేరు. కాబట్టి అంబటి త్వరలో మంత్రి పదవి కోల్పోయినా.. వచ్చే పర్యాయం టికెట్ దక్కించుకోలేకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.