హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్ స్టీన్ చేసిన దుర్మార్గం పండింది. తనకున్న పేరు ప్రఖ్యాతులతో మహిళా నటీమణులపై అతగాడు చేసిన దారుణాలు ఒక్కొక్కటి బయటకు రావటం ఒక ఎత్తు అయితే.. అతడిపై వస్తున్న తీవ్ర నేరారోపణలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున నిరూపితమవుతున్నాయి. తాజాగా అలాంటిదే మరొకటి రుజువైంది. నటిని అత్యాచారం చేసినట్లుగా ఉన్న ఆరోపణల కేసు ఒక కొలిక్కి వచ్చింది.ఆ కేసులో నిర్మాత హార్వే దోషిగా తేలారు.
ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన మీటూ ఉద్యమం వెనుక ఇతగాడి దారుణాలే ప్రధానం. అతడి వేధింపుల దారుణాలు బయటకు రావటంతో సంచలనంగా మారింది. అనంతరం.. ఇదే తరహాతో వ్యవహరించే వారికి వ్యతిరేకంగా మీ టూ ఉద్యమం మొదలైంది. మొదట్లో చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై ఈ ఉద్యమం మొదలైనా.. తర్వాతి కాలంలో మిగిలిన రంగాలకు వెళ్లింది. ఈ ఉద్యమం పుణ్యమా అని అప్పటివరకు బడా బాబుల మాదిరి వెలిగే ఎంతో మంది ప్రముఖుల జీవితాలు మసకబారాయి. కొందరు తాము చేసిన తప్పుల్ని ఒప్పుకోగా.. చాలామంది మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.
మీటూ ఉద్యమానికి ఆద్యుడిగా చెప్పే హార్వే వేన్ స్టీన్ ఇప్పటికే జైల్లో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా అతడిపై మరో అత్యాచార కేసులోనూ శిక్ష పడింది. 2013లో ఒక ఇటాలియన్ నటి కమ్ మోడల్ పై అత్యాచారం.. లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా లాస్ ఏంజెల్స్ కోర్టు నిర్ధారించింది. ఇతడిపై ఇప్పటికే పలు కేసుల్లో 23 ఏళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. తాజా తీర్పుతో అతడికి మరో 24 ఏళ్లు జైలుశిక్ష పడనుంది. చేసిన పాపం ఊరికే పోదని అందుకే అంటారేమో?