హైదరాబాదులోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల ముగింపు సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సభకు హాజరైన చంద్రబాబు…1999నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఐఎస్ బీ ఈ స్థాయికి చేరడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. 20 ఏళ్ల క్రితం తాను విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారని, 420 అని సెటైర్లు వేశారని అన్నారు.
అప్పటి మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ విజన్ 2020 గురించి ఇచ్చిన సలహా ప్రకారమే విజన్ 2020 రూపొందించామని గుర్తు చేసకున్నారు. ఆ విజన్ 2020 కల నేడు సాకారమైందని, విజన్ 2020లో భాగంగా ప్రారంభించిన సంస్థలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయని చెప్పారు. భారతీయులు పుట్టుకతోనే గణితంలో ప్రజ్ఞావంతులని, బ్రిటిషు వాళ్లు వదిలేసిన ఇంగ్లీషు..కలిసి భారతీయులు తిరుగులేని కాంబినేషన్ గా అవతరించేలా చేశాయని, ఐటీలో మన దేశస్థులను అగ్రగామిగా నిలిపాయని కొనియాడారు. 100 శాతం భారత్ బలం ఇదేనంటూ బిల్ గేట్స్ కూడా అంగీకరించారని గుర్తు చేసుకున్నారు.
20 ఏళ్ల కిందట నగరంలో సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కటే ఉండేదని, ఇప్పుడు ప్రపంచస్థాయి సంస్థలకు హైదరాబాద్ నిలయంగా మారిందని చంద్రబాబు అన్నారు. ఎంతో శ్రమించాక హైదరాబాదులో ఐఎస్ బీ స్థాపించాలన్న కల సాకారమైందని వివరించారు. కాగా, ఐఎస్ బీ చంద్రబాబు తీర్చిదిద్దిన సంస్థ అని ఐఎస్ బీ డీన్ మదన్ పిల్లుట్ల కొనియాడారు. నాలెడ్జ్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ కోసం చంద్రబాబు కృషి చేశారని అన్నారు. తన రోల్ మోడల్ చంద్రబాబేనని అన్నారు. ఐఎస్ బీ టాప్-10లో కాదు… టాప్ లో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారని వివరించారు. చంద్రబాబు ఎంతో దార్శనికత ఉన్న నేత అని, ఐఎస్ బీ పురోగతి కోసం ఆయన ఎంతో కృషి చేశారని వెల్లడించారు.