అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిల వ్యవహారం కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టీడీనీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతను టార్గెట్ చేసుకొని ప్రకాష్ రెడ్డి కక్ష సాధిస్తున్న వైనంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై తోపుదుర్తి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి.
చివరకు చంద్రబాబుకు చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ వివాదం సద్దుమణుగుతుందనుకున్న తరుణంలో తాజాగా తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా ఉరవకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒక కేసు విషయంలో పంచాయతీ పెట్టారు. ఓ స్థలానికి సంబంధించిన కేసు విషయంలో నిందితులకు మద్దతుగా చంద్రశేఖర్ రెడ్డి స్టేషన్లోనే హల్చల్ చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
తన అనుచరులను వెంటబెట్టుకొని స్టేషన్ కు వెళ్లిన చంద్రశేఖర్ రెడ్డి అక్కడే పంచాయతీ పెట్టారు. తన సన్నిహితులను అదుపులోకి తీసుకుంటారా అంటూ పోలీసులపైనే చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో, ఆయన వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
2019లో రుద్రంపేటలో 1.27 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి డివి నాయుడు, బ్యాంకు మాజీ ఉద్యోగి గౌరీ శంకర్ లకు రమేష్ అనే వ్యక్తి విక్రయించారు. అడ్వాన్స్ గా కొంత డబ్బు ఇచ్చిన ఆ ఇద్దరు..సదరు స్థలాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే, మిగిలిన డబ్బులు ఇవ్వకపోవడంతో రమేష్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
దీంతో, ఆ ఇద్దరు డబ్బులు ఇవ్వకుండా బెదిరించడంతోనే తన భర్త రమేష్ ఆత్మహత్య చేసుకున్నారని భార్య నీరజ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేయగా చంద్రశేఖర్ రెడ్డి స్టేషన్ కి వచ్చి పంచాయతీ పెట్టారు.