ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 175 స్థానాలనూ వైసీపీ కైవనం చేసుకుంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్న సంగతి తెలిసిందే. తన పాలనపై నమ్మకంతో జగన్ అలా చెబుతున్నాడని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. తమ పథకాలు, ఉచిత హామీలు ఈసారి కూడా తమను అధికార పీఠంపై కూర్చోబెడతాయని గట్టిగా నమ్ముతున్నారు. కానీ, జగన్ అలా అన్ని స్థానాలు గెలుస్తానని బల్లగుద్ది మరీ చెప్పడం వెనుక అసలు రహస్యం ఏమిటో టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు బట్టబయలు చేశారు.
ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లను చేర్చి, వారు వేసే ఓట్లపై భరోసాతోనే 175కు 175 సీట్లు గెలుస్తామని జగన్ చెబుతున్నారని అయ్యన్న ఆరోపించారు. ఉత్తరాంధ్రలో త్వరలో జరగబోతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో భారీగా అనర్హుల పేర్లు చేర్చారని ఆయన ఆరోపించారు. దాదాపు 16 వేలమంది అనర్హుల పేర్లను గుర్తించామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కు అయ్యన్న ఫిర్యాదు
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసేందుకు డిగ్రీ పాస్ అయిన వారు అర్హులని, కానీ, తాజాగా ఉత్తరాంధ్రలోని ఓటర్ల ముసాయిదా జాబితాలో ఇంటర్ పాస్ అయిన వారి పేర్లతో పాటు ఫెయిల్ అయినవారి పేర్లు కూడా ఉన్నాయని అయ్యన్న విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారని, అందులో ఒక్క ఉత్తరాంధ్ర నుంచే 16 వేల ఓట్లున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వాలంటీర్ల వ్యవస్థ పెట్టింది ఇందుకేనా అని జగన్ ను నిలదీశారు. ఆ జాబితాలో అవకతవకలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని చెప్పారు.