‘బాహుబలి’తో యావత్ భారత దేశాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఇక, ఆర్ఆర్ఆర్ చిత్రంతో యావత్ ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాను పరిచయం చేసిన ఘనత కూడా జక్కన్నకే దక్కుతుంది. ఆ సినిమా చూసిన హాలీవుడ్ నిర్మాతలు రాజమౌళికి ఆఫర్లు ఇస్తున్న వైనం తెలుగు వారందరినీ గర్వపడేలా చేసింది. ఇప్పటివరకు ఫ్లాప్ ఎరుగని దర్శకుడిగా రాజమౌళి సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.
భారీ బడ్జెట్, భారీ చిత్రీకరణ, గ్రాఫిక్స్ లతో భారీ హిట్ లు కొట్టడం జక్కన్నకు అలవాటు. అయితే, అటువంటి దిగ్గజ దర్శకుడి ఆలోచనా శైలిని ఓ చిన్న సినిమా మార్చేసిందట. ఇన్నాళ్లూ సినిమా అంటే భారీతనం అనుకున్న రాజమౌళి…తన ఫార్ములాపై పునరాలోచనలో పడేసేలా ఆ సినిమా చేసిందట. ఇటీవల యావత్ దేశం చర్చించుకున్న ‘కాంతారా’ సినిమా జక్కన్నకు షాకిచ్చిందట. రూ. 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయి దాదాపు రూ. 350 కోట్లు వసూల్ చేసింది.
భారత సినీ పరిశ్రమ చరిత్రలో మరే సినిమా సాధించని ఘనత, కీర్తి, కలెక్షన్లు ఈ సినిమా దక్కించుకుంది. తన నటన, దర్శకత్వ ప్రతిభతో అందరినీ కట్టిపడేసిన రిషభ్ శెట్టి…జక్కన్నను ఆలోచనలో పడేశాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి చెప్పారు. భారీ బడ్జెట్, చిత్రీకరణ భారీగా ఉండాలనుకునే తనలాంటి వారిని ‘కాంతారా’ ఇరుకున పెట్టిందని జక్కన్న అన్నారు. తనను తాను సమీక్షించుకునేలా, ప్రశ్నించుకునేలా చేసిన సినిమా కాంతారా అని రాజమౌళి చెప్పడం విశేషం.
తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించడం అద్భుతమని జక్కన్న కితాబిచ్చాడు. ఇకపై తనలాంటి వాళ్లు సినిమా తీసే ముందు కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలని ఈ చిత్రం సూచించిందని చెబుతున్నాడు జక్కన్న.