టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారంటూ దాదాపుగా రెండేళ్ల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. గంటా చాలాకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, గంటా వైసీపీలో చేరతారన్న ప్రచారాన్ని ఏనాడూ గట్టిగా ఖండించకపోవడంతో వైసీపీలో ఆయన చేరిక ఖాయమని అంతా అనుకున్నారు. ఇక, టీడీపీ కార్యక్రమాల్లోగానీ, అసెంబ్లీ సమావేశాల్లో గానీ గంటా యాక్టివ్ గా లేకపోవడం, వైసీపీపై నామ మాత్రపు విమర్శలతో సరిపెడుతున్నారు.
దానికితోడు జగన్ పై గంటా కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లతో తాను వైసీపీలో చేరడం లేదనే హింట్ ఇచ్చేలా చేశాయి. ఈ క్రమంలోనే వైసీపీలో గంటా చేరబోతున్నారని, డిసెంబర్ మొదటివారంలో నిర్ణయం ప్రకటించబోతున్నారని పుకార్లు వినిపించాయి. అయితే, డిసెంబరు రెండో వారం పూర్తి కావస్తున్నా గంటా వైసీపీ గంట కొట్టలేదు. దీంతో, ఈ సారి కూడా అది గాలివార్తే అని తేలింది. ఈ నేపథ్యంలోనే తాను పార్టీ మారబోతున్నానంటూ వస్తున్న పుకార్లపై గంటా స్వయంగా స్పందించారు.
పార్టీ మార్పు గురించి తానెప్పుడూ మాట్లాడలేదని, అటువంటి నిర్ణయం తీసుకుంటే తానే స్వయంగా ప్రకటిస్తానని గంటా క్లారిటీనిచ్చారు. వంగవీటి రంగా ఏ కులానికో, ప్రాంతానికో ప్రతినిధి కాదని, బడుగు, బలహీన వర్గాల నాయకుడని గంటా అన్నారు. బడుగు వర్గాల సంక్షేమం కోసం పాటుబడినందుకే రంగా వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రశంసించారు. కాపునాడు బహిరంగ సభ పోస్టర్ విడుదల సందర్భంగా గంటా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కాపునాడు సభను విజయవంతం చేయాలని గంటా కోరారు.
కాపునాడు పోస్టర్ పై వంగవీటి రంగా, మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రముఖంగా ముద్రించడం విశేషం. గంటా తాజా కామెంట్లతో ఆయన జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలోనే ఆయన కొద్ది రోజుల క్రితం చిరంజీవితో భేటీ అయ్యారని, త్వరలోనే జనసేన కండువా కప్పుకుంటారని పుకార్లు వినిపిస్తున్నాయి.