తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కలకలం రేగింది. తాజాగా పార్టీ అధిష్టానం ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ పదవుల కేంద్రంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పదవుల కేటాయింపు తనకు అసంతృప్తిని కలిగించిందని మజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాదు, తన ఆవేదనను వివరిస్తూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీలో తన పేరు లేకపోవడమే కాదు.. వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ నాయకుడి పేరు లేకపోవడం మనస్తాపం కలిగించిందని సురేఖ పేర్కొన్నారు. రేవంత్ నివాసానికి స్వయంగా వెళ్లి సురేఖ తన అసంతృప్తిని వెలిబుచ్చారు.
రాజకీయ వ్యవహారాల కమిటీలో జూనియర్లకు స్థానం కల్పించారని, తనను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా నియమించడం జీర్ణించుకోలేకపోతున్నానని కొండా సురేఖ అన్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో రాజకీయ వ్యవహారాల కమిటీ నిండిపోయిందని కొండా సురేఖ విమర్శించారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కానీ వాళ్లను నామినేట్ చేసిన కమిటీలో.. తనను నామినేట్ చేయడం అవమాన పరిచినట్లుగా భావిస్తున్నాని తెలిపారు.
తనకు పదవుల కంటే ఆత్మాభిమానం ముఖ్యమని.. ఇకపై కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్య కార్యకర్త మాదిరి కొనసాగుతానని కొండా సురేఖ స్పష్టం చేశారు. మొత్తంగా ఈ పరిణామం.. తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వివాదానికి దారితీసిందనే చెప్పాలి. ఇక, కొండా లైన్లో ఎంత మంది బయటకు వస్తారో చూడాలి.