దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. ఆయన ఆత్మగా పేర్కొనే ప్రాణ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. అనునిత్యం వైఎస్ వెంట ఉండే కేవీపీ.. ఆయన మరణం తర్వాత జగన్ వెంట ఉంటారని చాలామంది భావించారు. అందుకు భిన్నంగా చాలా త్వరగా ఆయన జగన్ నుంచి దూరమయ్యారు.
నిజానికి తన తండ్రి రాజకీయ వారసత్వానికి తానే వారసుడని చెప్పుకునే జగన్.. తన తండ్రికి ఆత్మలాంటి వ్యక్తికి ఎందుకు దూరమయ్యాడన్న చిన్న ప్రశ్న వేసుకుంటే ఆయన తీరు ఎలా ఉంటుందన్నది ఇట్టే అర్థమవుతుందని చెబుతారు.
విచిత్రంగా వైఎస్ ను అమితంగా ఆరాధించే వారిలో చాలామంది ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. ఆ మాటకు వస్తే.. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన కేవీపీ మాత్రమే కాదు.. ఆయన నీడలా వ్యవహరించిన సూరీడు సైతం జగన్ దరిదాపుల్లో కనిపించకపోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా కేవీపీ రామచంద్రరావు జగన్ పాలనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
ఏపీని ఆర్థికంగా అస్థిరపరిచి.. భావితరాల భవిష్యత్తును జగన్ నాశనం చేస్తున్నారని కేవీపీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఏపీలో జగన్ పాలన చూస్తే ఆవేదన కలుగుతుందని వ్యాఖ్యానించారు.
విభజన హామీల అమలు కోసం జగన్ పోరాడటం లేదని.. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీయటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్ర దశదిశ మారలేదన్న ఆయన.. దాని దుస్థితి చూస్తుంటే తనకు బాధేస్తోందన్నారు. కేవీపీ వ్యాఖ్యల్లో కీలక అంశాల్ని చూస్తే..
– జగన్ పోలవరాన్ని పట్టించుకోవడం లేదు.
– విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడుతున్నా.. ఆపేందుకు ప్రయత్నించడం లేదు.
– పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం, రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం జగన్ తండ్రి వైఎస్ లక్ష్యం. వీటిని నెరవేర్చడానికి జగన్ ప్రయత్నించలేదు.
– మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి, తనకు కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ ఇచ్చింది. 1978 నుంచి అనేక పదవులు కట్టబెట్టింది. అలాంటి పార్టీని వీడకూడదని, ఏనాడూ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదని.. పల్లెత్తుమాట అనకూడదని 1996లోనే రాజశేఖర్‌రెడ్డి, నేనూ ఒట్టేసుకున్నాం.
– బంగారు భవిష్యత్ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోంది.
https://twitter.com/vravireddy/status/1601774332833067009