ఉమ్మడి ఏపీ విభజన తీరుపై సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసు వ్యవహారం దుమారం రేపుతోంది. విభజన అంశాలను ఇక వదిలేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంపై ఉండవల్లి ఫైర్ అయ్యారు. ఎవరి ప్రయోజనం కోసం ఈ అఫిడవిట్ వేశారని, ఏపీకి అన్యాయం జరుగుతోంటే జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
విభజన గురించి ఉండవల్లి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వీలైతే ఏపీ మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే వైసీపీ విధానమని, రెండు రాష్ట్రాలు కలిసిపోతే స్వాగతించే మొదటి పార్టీ తమదేనని సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి. ఉండవల్లి వ్యాఖ్యలు అసందర్భంగా అనిపించాయని, పనిగట్టుకుని జగన్ ను విమర్శిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. విభజనను వైసీపీ వ్యతిరేకించిందని, చివరి వరకు పోరాడిందని సజ్జల వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె అన్నారు. సజ్జల వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివని అన్నారు. తెలంగాణ ఒక వాస్తవం అని, ఎంతోమంది బలిదానాలు, త్యాగాల ఫలితమే తెలంగాణ అని వివరించారు. రెండు రాష్ట్రాలూ కలవడం అసాధ్యం అని, విభజిత రాష్ట్రాలను మళ్లీ ఎలా కలుపుతారు? అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాలను కలపడం మీద కాకుండా, ఏపీ అభివృద్ధిపై ధ్యాస పెట్టాలని సజ్జలకు షర్మిల చురకలంటించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం తగదని సజ్జలకు హితవు పలికారు.